ఈసీ వెబ్ సైట్లో ఎన్నికల ఫలితాలు
హైదరాబాద్: వచ్చే నెల 16న వెలువడనున్న లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను వెంటనే ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్లో చూడొచ్చు. ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్ వేర్‌ను ఈసీ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఐవీ సుబ్బారావుకు పంపించింది. వచ్చే నెల 2న ఈ సాఫ్ట్ వేర్ ఇన్ స్టాల్ చేసి 3న ఈసీ వెబ్ సైట్లో నమూనా లెక్కింపు ఫలితాలను ఉంచుతారు. 16న అసెంబ్లీ ఫలితాలు రౌండ్లు వారీగా ప్రకటించకముందే సంబంధిత రిటర్నింగ్ అధికారి ముందుగా దీనికి సంబంధించిన వివరాలను నెట్‌లో ఫీడ్ చేస్తారు. ఫలితాలు అధికారికంగా ప్రకటించేటప్పటికి ఈసీ సైట్‌లో కూడా చూడొచ్చన్నమాట.
కడప, విశాఖపట్నం జిల్లాల్లో ఎన్నికల ఫలితాలు మిగిలిన జిల్లాల కంటే ముందు వచ్చే అవకాశం ఉంది. ప్రతి జిల్లాలోనూ కౌంటింగ్ కేంద్రంలో 14 నుంచి 25 టేబుళ్లను వినియోగించి ఓట్ల లెక్కింపును చేపట్టొచ్చు. మిగిలిన జిల్లాల కంటే కడప, విశాఖ జిల్లా కలెక్టర్లు ప్రతి కౌంటింగ్ కేంద్రంలోనూ 20 టేబుళ్లు ఏర్పాటు చేసి ఓట్లను లెక్కించేందుకు అనుమతి కోరారు. అధికంగా టేబుళ్లను ఉపయోగిస్తున్నందున ఈ రెండు జిల్లాల్లో ముందుగానే ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. 20 టేబుళ్ల ఏర్పాటుకు ఈసీ గురువారం అనుమతించే అవకాశం ఉంది. ఈసారి అనేక దళిత వాడల్లో తొలిసారి ఓటు హక్కును వినియోగించుకొన్నారు. ఇలాంటి అరుదైన సంఘటలను ప్రతి ఒక్కరూ తెలుసుకొనేలా డాక్యుమెంట్లను తయారు చేయమని సుబ్బారావు కలెక్టర్లను ఆదేశించారు.












Click it and Unblock the Notifications