'జన నాయకుడు' రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఆ రోజు థియేటర్ల వద్ద రచ్చరచ్చే..!
తమిళనాట ప్రేక్షకులతోపాటు పాన్ ఇండియా రేంజ్ లో సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'జన నాయకుడు' మూవీ ఎట్టకేలకు థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు సీఎం దళపతి విజయ్ హీరోగా నటించిన ఈ మూవీ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సి ఉన్నా సెన్సార్ బృందం అడ్డుచెప్పడంతో అనేక సార్లు వాయిదా పడుతూ వస్తోంది. అలా వాయిదాల పర్వం ముగిసిన తర్వాత ఈ మూవీకి ఎట్టకేలకు ఇటీవల సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. దాంతో చిత్ర యూనిట్ రిలీజ్ డేట్ ను కొద్దిసేపటి క్రితమే ప్రకటించింది.
ఈ మూవీ జూలై 23న గ్రాండ్ గా విడుదల కానుంది. తొలుత జూలై 24 న విడుదల చేయాలని భావించినా ఒకరోజు ముందే అంటే జూలై 23 నే థియేటర్లలోకి రానున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటన చేసింది. ఈ క్రమంలో విడుదలకు ఎదుర్కొన్న సవాళ్లను ప్రస్తావిస్తూ పోరాటం ఎంత కఠినమైనదైతే విజయం కేరింతలు అంత గొప్పగా ఉంటాయని పేర్కొన్నారు. సెన్సార్ వివాదం నేపథ్యంలో పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీ ఎట్టకేలకు రిలీజ్ కానున్న తరుణంలో విజయ్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.
'జన నాయకుడు' సినిమాను హెచ్. వినోద్ తెరకెక్కించారు. ఈ మూవీలో యంగ్ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా మెరిశారు. అలాగే మలయాళ బ్యూటీ మమితా బైజు, బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించారు. ఈ మూవీని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకట్ కే. నారాయణ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పోస్టర్లు సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. సీఎం విజయ్ చివరి సినిమా కావడంతో ఫ్యాన్స్ తో పాటు సినీ అభిమానులు ఈ మూవీపై ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.














Click it and Unblock the Notifications