సచివాలయంలో అగ్నిప్రమాదం
హైదరాబాద్: సచివాలయం డి-బ్లాక్ మూడవ అంతస్థులో గురువారం నాడు అగ్ని ప్రమాదం సంభవించింది. రెండో అంతస్థులో షార్ట్ సర్యూట్ జరిగి ఆ మంటలు మూడో అంతస్థుకు వ్యాపించినట్లు తెలుస్తున్నది. వెెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది విద్యుత్ కనెక్షన్‌ను కట్ చేశారు. దీనితో లిఫ్టులో కొంత మంది ఉద్యోగులు చిక్కుకుపోయినట్లు తెలుస్తున్నది. అదేవిధంగా మూడో అంస్థులో ఉన్నటువంటి ఐటి, అటవీ శాఖ, ఆర్థిక శాఖ ఉద్యోగులను నిచ్చెనల ద్వారా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
రెండు, మూడో అంతస్థుల నుంచి దట్టమైన పొగలు వ్యాపిస్తూ వుండడంతో పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నది. ఉద్యోగులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. మరోపక్క అగ్నిమాపక దళ సిబ్బంది రంగంలోకి దిగి మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నది. షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణంగా తెలుస్తున్నది. కాగా, గత రెండు సంవత్సరాలలో సచివాలయంలో లెక్కకు మించి అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నా అధికారులు శాశ్వత పరిష్కార యత్నాలేవీ చేసిన దాఖలాలు కనిపించవు. సంవత్సరంలో సచివాలయం మరమ్మత్తుల కోసం అధికారులు భారీగా రూ.10 కోట్లకు పైగానే వెచ్చించడం గమనార్హం.
కొత్తగా నిర్మించిన ఈ బ్లాక్ లో ఆర్ధిక మంత్రి రోశయ్య, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కెవిపి రామచంద్రరావు తదితర విఐపిల పేషీలు ఉన్నాయి. ఆర్ధిక శాఖకు చెందిన ఫైళ్ళు చాలా వరకు కాలిపోయినట్టు తెలుస్తోంది. మంటలు వ్యాపించిన వెంటనే కరెంటు పోవడంతో కొందరు ఉద్యోగులు లిఫ్ట్ లలో ఇరుక్కుపోయినట్టు అనుమానిస్తున్నారు. కొంతమంది ఉద్యోగులను అగ్నిమాపక సిబ్బంది కిటికీల గుండా కిందికి దింపుతున్నారు.












Click it and Unblock the Notifications