మరో భారత విద్యార్థిపై దాడి
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థులపై దాడుల పరంపర కొనసాగుతోంది. తాజాగా 25 ఏళ్ల బల్జీందర్ సింగ్ అనే విద్యార్థిపై ఇద్దరు వ్యక్తులు కత్తితో దాడి చేశారు. సోమవారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు 'హెరాల్డ్ సన్' పత్రిక తెలిపింది. ఇద్దరు దుండగులు బల్జీందర్ సింగ్‌ను డబ్బు ఇవ్వాల్సిందిగా తొలుత డిమాండ్ చేశారని, అతను పర్సు కోసం వెతుకుతున్న సమయంలో కత్తితో పొత్తికడుపులో పొడిచారని రాసింది. "నన్ను చంపొద్దంటూ వేడుకున్నా. బిగ్గరగా అరిచా.. అయినా వారు కనికరించలేదు. వెకిలిగా నవ్వుతూ నా కడుపులో పొడిచారు" అని సింగ్ చెప్పాడు. మెల్‌బోర్న్ పట్టణం జీవించడానికి అనువైనదిగా భావించానని, అయితే ఇక్కడి భారతీయ విద్యార్థులే లక్ష్యంగా దుండగులు దాడులకు పాల్పడుతున్నారని అన్నాడు.
ఆస్ట్రేలియాలో నాలుగు రోజుల క్రితం దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులకు ఇప్పుడు మరో చేదు అనుభవం ఎదురైంది. చికిత్స నిమిత్తం గాయపడిన నలుగురు విద్యార్థులు ఆసుపత్రిలో ఉండగా అదే అదనుగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వారి ఇళ్లను కొల్లగొట్టారు. అందినకాడికి దోచుకుని పరారయ్యారు. "దుస్తులతో సహ చేతికందిన ప్రతి వస్తువునూ దోచుకెళ్లారు. ఈ ఘటన వల్ల అభద్రతా భావంతో విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు" అని అక్కడి భారతీయ విద్యార్థుల సంఘం (ఫిసా) అధ్యక్షుడు గౌతం గుప్తా అన్నారు.












Click it and Unblock the Notifications