పెట్రోల్, డీజిల్ ధరల పెంపు

బుధవారం దేవ్ రా పార్టీ నాయకత్వంతోనూ, ప్రధాని మన్మోహన్ సింగ్ తో మాత్రమే చర్చించి సాయంత్రం నిర్ణయాన్ని వెలువరించారు. గురువారం నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆ రోజే మంత్రి మండలి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ లోపే ధరల పెంపుపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం నిశ్చయించుకుంది.
వంటగ్యాస్, కిరోసిన్ ధరల్లో ఎటువంటి మార్పూ లేదు. వీటి ధరలు పెంచకపోవడం వల్ల ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం రూ.30 వేల కోట్ల మేర నష్టం భరించాల్సి ఉంటుందని దేవ్‌రా విలేకర్లతో అన్నారు. తొలుత పెట్రోలుపై రూ.5, డీజిల్ పై రూ.3 చొప్పున పెంచాలని ఆ శాఖ యోచించింది. చివరకు పెంపును రూ.4, రూ.2గా ప్రభుత్వం ఖరారు చేసింది.
తాజా పెంపు నిర్ణయం తాత్కాలికమేనని దేవ్‌రా చెప్పారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు దిగి వస్తే ఆ లాభాన్ని వినియోగదారులకే అందిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికీ వినియోగదారులపై పూర్తి భారాన్ని మోపలేదని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి పెట్రోల్, డీజిల్ పై ఇంకా రూ.20వేల కోట్ల వరకు వసూళ్ల లోటు ఉంటుందని వెల్లడించారు.
ప్రభుత్వరంగ చమురు సంస్థలు రోజుకు రూ.170 కోట్ల నష్టాలు చవిచూస్తున్నాయని అధికారులు వెల్లడించారు. అంతర్జాతీయ ముడిచమురు ఏడునెలల కాలంలో గరిష్ఠంగా బ్యారెల్‌కు 71 డాలర్లకు చేరిన నేపథ్యంలో జూన్ ద్వితీయార్థంలో లీటరు పెట్రోలుపై రూ.6.94, డీజిల్ పై రూ.4.11 మేర నష్టాలు నమోదయ్యాయి. 14.2 కేజీల వంటగ్యాస్ సిలిండర్ పై రూ.92.96, లీటరు కిరోసిన్ పై రూ.15.26 భారం పడుతున్నట్లు దేవ్ రా వెల్లడించారు. ఆర్థిక సంవత్సరాంతం నాటికి మొత్తం రూ.49వేల కోట్ల వరకు ఆదాయం కోల్పోవచ్చని అంచనా వేశారు.












Click it and Unblock the Notifications