మేడారం నుండే కొత్త పెన్షన్ ల పంపిణీ చేయనున్న సీఎం రేవంత్!
తెలంగాణ ప్రభుత్వం అర్హులైన వారికి కొత్త పెన్షన్లు మంజూరు చేసే కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఈ కార్యక్రమం మేడారం నుంచి మొదలవుతుందని తెలంగాణా మంత్రి సీతక్క ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా వితంతువులు, ఒంటరి మహిళలకు నూతనంగా మంజూరైన పెన్షన్ల పంపిణీని ఈ నెల 16న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం నుంచి ప్రారంభిస్తారని తెలిపారు.మేడారం లోని సమ్మక్క సారలమ్మ గద్దెల వద్దనుండే ప్రారంభిస్తారని చెప్పారు.
మేడారం నుండే కొత్త పెన్షన్ ల పంపిణీ
మంత్రి సీతక్క తెలిపిన వివరాల ప్రకారం, మధ్యాహ్నం 12 గంటలకు హెలికాప్టర్ ద్వారా సచివాలయ మంత్రులతో కలిసి సీఎం మేడారం చేరుకుంటారు. అక్కడ కొత్త పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా రూ.16 వేల కోట్లతో చేపట్టిన హ్యామ్ రోడ్ల పైలాన్ ప్రాజెక్ట్, నూతన కలెక్టరేట్‌ను కూడా ఆవిష్కరిస్తారు.

కొత్త పెన్షన్ లు జారీ చేసేది వీరికే
ప్రభుత్వం తాజా నిర్ణయం ప్రకారం కొత్త పెన్షన్లు మొదటి దశలో వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, అలాగే ఫైలేరియా, తలసేమియా, సికిల్ సెల్, హీమోఫీలియా వంటి వ్యాధులతో బాధపడేవారికి మంజూరు చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మూడు లక్షల నుంచి 3.5 లక్షల మందికి విడతల వారీగా ఈ పెన్షన్లు అందించాలని నిర్ణయించారు. మహిళలు, దివ్యాంగులు, అనారోగ్యంతో ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తున్నారు.
చేయూత పోర్టల్‌లో దరఖాస్తు ఫారాలు
దివ్యాంగులకు నెలకు రూ.4,016, ఇతరులకు రూ.2,016 పెన్షన్ అందుతుంది. దరఖాస్తు ఫారాలు చేయూత పోర్టల్‌లో అందుబాటులో ఉన్నాయి. దరఖాస్తు చేసేవారు ఆధార్ కార్డు, వయస్సు ధ్రువీకరణ పత్రం, రేషన్ కార్డు లేదా ఆహార భద్రత కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, బ్యాంకు పాస్‌బుక్ మొదటి పేజీని సమర్పించాలి. కేటగిరీని బట్టి అదనపు పత్రాలు కూడా అవసరం కావచ్చు. దరఖాస్తుల తుది గడువు ఆగస్టు 31 వరకు పొడిగించారు.
అర్హులు అప్లై చేసుకోవాలన్న అధికారులు
మేడారం నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన మహిళలు, ఇతర వర్గాలవారికి చేయూత పెన్షన్ లను అందించనుంది. అర్హులైనవారు ఆందోళన పడాల్సిన అవసరం ;లేదని, త్వరగా దరఖాస్తు చేసుకుని ప్రయోజనం పొందాలని అధికారులు సూచిస్తున్నారు.













Click it and Unblock the Notifications