బాబుకెందుకు శ్రద్ధ: వైయస్
హైదరాబాద్: ఓబుళాపురం గనుల వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి ఎందుకంత వ్యక్తిగత శ్రద్ధ అని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ప్రశ్నించారు. ఓబుళాపురం గనుల వ్యవహారంపై విచారణకు సభా సంఘం వేయాలని తెలుగుదేశం సహా ఇతర ప్రతిపక్షాలు పట్టుబడుతున్న సమయంలో ఆయన గురువారం శాసనసభలో జోక్యం చేసుకుని మాట్లాడారు. చంద్రబాబు అసంబద్ధమైన ఆరోపణలు చేస్తున్నారని, ఎన్నికల్లో ఓడిపోయామనే నిస్పృహతోనే చంద్రబాబు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. చంద్రబాబుపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఓబుళాపురం గనుల లీజు వ్యవహారం నిబంధనల మేరకే జరిగిందని ఆయన స్పష్టం చేశారు. చట్టాలకు లోబడే గనులను లీజుకు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. గనుల లీజులో ఎలాంటి మోసాలు లేవని ఆయన చెప్పారు. ఓబుళాపురం గనుల వ్యవహారంలో నివేదిక కోసం కోర్టు అడిగితే తాము తనిఖీలు నిర్వహించి నివేదిక సమర్పించామని, లీజు వ్యవహారంలో ఎలాంటి అవకతవకలు లేవని తనిఖీల్లో తేలిందని ఆయన చెప్పారు. సుప్రీంకోర్టు విషయంలో కూడా నాలుగు రోజుల క్రితమే కేంద్ర బృందం తనిఖీలు చేసి అక్రమాలు లేవని తేల్చిందని ఆయన చెప్పారు. ఐదేళ్ల పాటు ఆరోపణలు చేసినా ప్రజలు నమ్మలేదని, చంద్రబాబు ఒత్తిడి వల్లనే మిగతా విపక్షాలు కూడా ఆరోపణలు చేస్తున్నాయని ఆయన అన్నారు. ఓబుళాపురం గనుల వ్యవహారంపై సభా సంఘం వేయాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications