విజయనగరం: రామ్ చరణ్ తేజ నటించిన మగధీర సినిమాకు వెళ్లి ఐదుగురు మృత్యువాత పడ్డారు. విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో ఆదివారం సాయంత్రం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. టికెట్లు తీసుకునే సమయంలో లక్ష్మి, శ్రీలక్ష్మి థియేటర్ల వద్ద విద్యుత్ ప్రమాదం సంభవించి వారు మృత్యువు పాలయ్యారు. అంతుకు ముందు రోజు వరంగల్ జిల్లా ఖాజీపేటలోని భవానీ థియేటర్ లో విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి చెందారు. సాలూరు పట్టణంలో జరిగిన ప్రమాదంలో 11 మంది గాయపడ్డారు.
ప్రమాదంలో సాలూరుకు చెందిన పిల్లి లింగరాజు (20), రెడ్డి దుర్గాప్రసాద్ (17), తుట్ట రమేష్ (27), సాలూరు మండలం మరిపిల్లికి చెందిన పోతనపల్లి అప్పన్న (19), పాచిపెంట మండలం బొబ్బిలి వలసకు చెందిన చెందిన సంబర లచ్చయ్య (29) మరణించారు.