న్యూఢిల్లీ: దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి తనయుడు వైయస్ జగన్ తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసేందుకు అపాయింట్ మెంటు అడిగినట్లు తనకు తెలియదని కాంగ్రెసు అధికార ప్రతినిధి జయంతీ నటరాజన్ అన్నారు. జగన్ సోనియా గాంధీ అపాయింట్ మెంట్ కోరినట్లు వచ్చిన వార్తలపై మీడియా ప్రతినిధుల ప్రశ్నించగా ఆమె గురువారం ఆ విధంగా అన్నారు. ఎప్పుడు అవసరమనుకుంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ (సిఎల్పీ) సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని ఆమె చెప్పారు. వైయస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం సిఎల్పీ సమావేశాన్ని ఏర్పాటు చేయకపోవడంపై పలు విమర్సలు వస్తున్న నేపథ్యంలో ఆమె ఆ విధంగా అన్నారు.
రాష్ట్రంలో ముఖ్యమంత్రి, మంత్రులున్నారని, పాలనా వ్యవహారాలు సజావుగా సాగుతున్నాయని ఆమె ఇదివరలో అన్నారు. దాంతో వైయస్ జగన్ కు ముఖ్యమంత్రిని చేయడానికి పార్టీ అధిష్టానం సిద్ధంగా లేదనే అభిప్రాయం ఊపందుకుంది.