రాజౌరి: రుక్సానా కౌషర్ ఇంటిపై శుక్రవారం రాత్రి మిలిటెంట్లు దాడి చేశారు. సాయుధ లష్కరే తోయిబా మిలిటెంట్లను ఎదుర్కుని ఒక మిలిటెంటును హతమార్చడం ద్వారా రుక్సానా దేశవ్యాప్తంగా గుర్తింపులోకి వచ్చిన విషయం తెలిసిందే. మిలిటెంట్లు శుక్రవారం దాడి చేసిన సమయంలో రుక్సానా ఇంట్లో లేదు. మిలిటెంట్లు రాజౌరీలోని థానామండిలో గల రుక్సానా ఇంటిపైకి గ్రేనేడ్లు విసిరినట్లు, అయితే ఆ సమయంలో ఆమెగానీ ఆమె కుటుంబ సభ్యులు గానీ ఇంట్లో లేరని జిల్లా కలెక్టర్ ఎస్ జైపాల్ సింగ్ చెప్పారు. రుక్సానా, ఆమె కుటుంబ సభ్యులు రాజౌరీలోని సురక్షితమైన ప్రదేశంలో ఉన్నట్లు ఆయన తెలిపారు.
మిలిటెంట్లు రుక్సానా ఇంటిపై గ్రెనేడ్లు విసిరి చీకట్లోకి పారిపోయారు. తన ఇంటిపై దాడి జరుగుతున్న ఆ 22 ఏళ్ల యువతికి తెలుసునని కలెక్టర్ అన్నారు. దాడి జరుగుతుందనే ఉద్దేశంతోనే ఆమెను, ఆమె కుటుంబ సభ్యులను సురక్షితమైన ప్రదేశంలో ఉంచినట్లు ఆయన తెలిపారు. సెప్టెంబర్ 27వ తేదీన తన ఇంటికి వచ్చి దౌర్జన్యం చేయడానికి ప్రయత్నించిన లష్కరే తోయిబా మిలిటెంట్లను రుక్సానా ఎదుర్కుని వారిలో ఒకడిని కాల్పి చంపింది.