కుంభమేళా గర్ల్ మోనాలిసా పెళ్లి వివాదం.. తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు!
మధ్యప్రదేశ్ నుంచి కేరళ వరకు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన కుంభమేళా ఫేమ్ మోనాలిసా భోస్లే, ఆమె భర్త మహమ్మద్ ఫర్మాద్ ఖాన్ మతాంతర వివాహం కేసు ఇప్పుడు న్యాయస్థానాల చుట్టూ తిరుగుతోంది. ఈ వ్యవహారంలో మధ్యప్రదేశ్‌లో నమోదైన కిడ్నాప్, పోక్సో కేసుల నేపథ్యంలో ఈ దంపతులు కేరళ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ కౌసర్ ఎడప్పగత్ నేతృత్వంలోని బెంచ్ తీర్పును రిజర్వ్ చేసింది. అయితే విచారణ సందర్భంగా న్యాయమూర్తి చేసిన కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి.
మధ్యప్రదేశ్‌కు చెందిన మోనాలిసా, ఫర్మాన్ ఖాన్‌లకు వివాహం వల్ల అక్కడ తమకు ప్రాణహాని ఉందని.. అందుకే కేరళకు వచ్చారని వారి తరఫు న్యాయవాది ఎం.శశీంద్రన్ కోర్టుకు వివరించారు. అక్కడ కొన్ని మతోన్మాద శక్తులు, అధికార యంత్రాంగం తమను టార్గెట్ చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై కోర్టు స్పందిస్తూ.. "మీరు కేరళలో ఉండటం మీ అదృష్టం" అని నోటిమాటగా వ్యాఖ్యానించింది. దీనికి న్యాయవాది బదులిస్తూ.. "అవును యువర్ ఆనర్.. ఆ ఒక్క కారణం వల్లే మేము ఇప్పటికీ ప్రాణాలతో బ్రతికి ఉన్నాం" అని కోర్టుకు తెలిపారు. 2025 కుంభమేళాలో పూసల దండలు అమ్ముతూ సోషల్ మీడియా సంచలనంగా మారిన మోనాలిసా, ఈ ఏడాది మార్చిలో కేరళలో ఫర్మాన్‌ను వివాహం చేసుకున్నారు.

అయితే ఈ పెళ్లి జరిగినప్పటి నుంచి వివాదాలు చుట్టుముట్టాయి. మోనాలిసాకు ఇంకా పెళ్లి వయసు రాలేదని.. ఆమె మైనర్ అంటూ మోనాలిసా తండ్రి మధ్యప్రదేశ్‌లో ఫిర్యాదు చేశారు. కాగా పెళ్లి సమయానికే ఆమె మేజర్ అని, కానీ ఆమెను మైనర్‌గా చూపించడానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగం రికార్డులను తారుమారు చేసిందని దంపతుల తరఫు న్యాయవాది వాదించారు. మోనాలిసా స్వయంగా తన భర్తపై ఎలాంటి ఫిర్యాదు చేయలేదని, ఆమె సంతోషంగానే ఉందని కోర్టు దృష్టికి తెచ్చారు.
మరోవైపు మధ్యప్రదేశ్ సర్కారు తరఫున హాజరైన అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్.వి. రాజు ఈ బెయిల్ పిటిషన్‌ను తీవ్రంగా వ్యతిరేకించారు. పెళ్లి కొడుకు ముస్లిం అయినప్పటికీ.. ఈ వివాహం కేరళలోని ఒక హిందూ ఆలయంలో హిందూ సాంప్రదాయాల ప్రకారం జరిగిందని, హిందూ వివాహ చట్టం ప్రకారం ఇది చెల్లదని ఆయన వాదించారు. అంతేకాకుండా హాస్పిటల్ రికార్డుల ప్రకారం మోనాలిసా పుట్టిన తేదీ డిసెంబర్ 2009 అని, అంటే పెళ్లి సమయానికి ఆమె వయసు కేవలం 16 ఏళ్లేనని జాతీయ ఎస్టీ కమిషన్ విచారణలో తేలిందని స్పష్టం చేశారు. నకిలీ సర్టిఫికెట్లతో అధికారులను మోసం చేసినందుకు గానూ ఫర్మాన్‌పై ఫోర్జరీ కేసులు కూడా పెట్టనున్నట్లు కోర్టుకు వెల్లడించారు.
ఈ కేసు కేవలం ఓ వివాహానికి మాత్రమే పరిమితం కాకుండా రాజకీయ రంగు కూడా పులుముకుంది. కేరళలోని తిరువనంతపురం పోక్సో కోర్టులో ఓ ప్రైవేట్ ఫిర్యాదు నమోదైంది. ఈ పెళ్లిని ప్రోత్సహించి, దగ్గరుండి జరిపించారనే ఆరోపణలపై కేరళకు చెందిన అధికార సీపీఐ(ఎం) నేతలు ఎం.వి. గోవిందన్, వి. శివన్‌కుట్టి, ఏ.ఏ. రహీమ్‌లపై చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో కోరారు. వ్యక్తిగత స్వేచ్ఛ, మతాంతర వివాహ చట్టాలు, వయసు నిర్ధారణ, నేరపూరిత బాధ్యతలతో ముడిపడి ఉన్న ఈ హైప్రొఫైల్ కేసులో కేరళ హైకోర్టు ఇవ్వబోయే తీర్పు ఇరు రాష్ట్రాల చట్టపరమైన పరిణామాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications