పోలవరం ప్రాజెక్ట్ పరిసరాల్లో భయం భయం!
ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి మరియు ఏలూరు జిల్లాల సరిహద్దులోని పోలవరం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో పెద్దపులి సంచారం స్థానికంగా కలకలం రేపుతోంది. గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలోని అటవీ పరివాహక గ్రామాలు, కొండ ప్రాంతాల సమీపంలో పులి తిరుగుతుండటాన్ని స్థానికులు గమనించారు. దీంతో ప్రాజెక్టు పనుల్లో ఉన్న కార్మికులతో పాటు ఏజెన్సీ పరిధిలోని పోలవరం, దేవీ పట్నం మండలం గంగపాలెం, ఐఎస్ రాఘవాపురం, గూటాల మరియు పరిసర గ్రామాలప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు..
పశువులపై పులి దాడులు - అడుగుజాడల గుర్తింపు
ఈ ప్రాంతంలో పులి సంచరిస్తోందనడానికి బలమైన ఆధారాలు లభించాయి. నిన్న రాత్రి పశువులపై పులి దాడి చేసినట్లు స్థానికులు చెబుతున్నారు.16దూడలను, ఒక గేదెను హతమార్చినట్టు చెప్తున్నారు. అటవీ సమీపంలోని వాగులు, మెత్తటి నేలపై పెద్దపులికి సంబంధించిన స్పష్టమైన అడుగుజాడలను గమనించిన గ్రామస్తులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఫారెస్ట్ సిబ్బంది ఆ అడుగుజాడలను పరిశీలించి, అవి పెద్దపులి అడుగులేనని ప్రాథమికంగా నిర్ధారించారు.

అటవీ శాఖ చర్యలు - గ్రామాల్లో అలర్ట్
పులి సంచారం ఆ ప్రాంతాల్లో జరుగుతున్నట్టు నిర్ధారణ కావడంతో అటవీ శాఖ అధికారులు పటిష్టమైన చర్యలు చేపట్టారు. పులి ఏ దిశగా ప్రయాణిస్తుందో తెలుసుకోవడానికి, దాని కదలికలను నిరంతరం పర్యవేక్షించడానికి కీలకమైన ప్రాంతాలలో నైట్ విజన్ కెమెరా ట్రాప్‌లను ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా ఫారెస్ట్ బీట్ సిబ్బందితో నిఘా బృందాలను ఏర్పాటు చేసి అటవీ అంచుల్లో నిఘా పెట్టారు. గస్తీ ఉధృతం చేశారు.
సమీప గ్రామాల ప్రజలను అలెర్ట్ చేసిన అటవీ అధికారులు
పెద్దపులి సంచారం కారణంగా రాత్రి వేళల్లో మరియు తెల్లవారుజామున గ్రామస్తులు ఒంటరిగా బయటకు రావద్దని, ముఖ్యంగా పశువుల కాపరులు అడవి లోపలికి వెళ్లరాదని మైకుల ద్వారా చాటింపు వేయించి అప్రమత్తం చేశారు. పెద్దపులి జనావాస ప్రాంతాల వైపు రాకుండా ఉండేందుకు అటవీ సరిహద్దుల్లో అవసరమైన రక్షణ చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఆ ప్రయత్నాలు చెయ్యొద్దని సూచన
ప్రజలు ఎవరూ స్వయంగా పులిని పట్టుకోవడానికి లేదా గాయపరచడానికి ప్రయత్నించవద్దని అటవీ అధికారులు స్పష్టం చేశారు. పశువుల రక్షణ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా తాము పెద్ద పులిని పట్టుకుంటామని స్పష్టం చేశారు.













Click it and Unblock the Notifications