నాలుగు గోడల మధ్య నరకం ఇంకెన్నాళ్ళు!
గృహ హింస బయటి ప్రపంచానికి ఆధునిక నాగరిక సమాజంగా కనిపిస్తున్నా, నాలుగు గోడల మధ్య ఇంకా నివురు గప్పిన నిప్పులా కొనసాగుతూనే ఉంది . ఇటీవల డెహ్రాడూన్ లో ఒక వివాహితను ఆమె అత్తింటి వారు ఏకంగా పది నెలల పాటు మరుగుదొడ్డిలో బంధించి, ఆహారం ఇవ్వకుండా ఇనుప రాడ్లతో హింసించిన ఉదంతం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
రూపాంతరం చెందుతున్న గృహహింస
చదువుకున్న కుటుంబాలు, నాగరిక నగరాల్లోనూ ఇలాంటి అమానుషాలు జరుగుతుండటం.. గృహ హింస అనేది కేవలం పేదరికం లేదా నిరక్షరాస్యతకు సంబంధించింది కాదని నిరూపిస్తోంది. ఒకప్పుడు గృహ హింస అంటే కేవలం శారీరక దాడి లేదా కట్నం కోసం వేధించడం అనే కోణంలోనే చూసేవారు. కానీ నేటి డిజిటల్ యుగంలో దీని స్వరూపం మారింది. ప్రస్తుతం గృహ హింస ప్రధానంగా మూడు రకాలుగా కనిపిస్తోంది.

ఇన్ని విధాలా గృహ హింస
ఉద్యోగం చేసే మహిళల జీతాన్ని బలవంతంగా లాక్కోవడం, వారికి కనీస అవసరాలకు కూడా డబ్బులు ఇవ్వకుండా ఆర్థికంగా పూర్తిగా కుంగదీయడం కూడా గృహహింస క్రిందికే వస్తుంది. పుట్టింటివారితో మాట్లాడకుండా కట్టడిచేయడం, సోషల్ మీడియా అకౌంట్లను పర్యవేక్షిస్తూ అనుమానించడం, నిరంతరం హేళన చేస్తూ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడం కూడా గృహహింసనే.. భార్య ప్రయాణించే వాహనాలకు లేదా మొబైల్స్‌కు ట్రాకింగ్ డివైజ్‌లు పెట్టడం, డిజిటల్ నిఘా ద్వారా భయాందోళనలకు గురిచేయడం కూడా ఇటీవల పెరిగిపోయాయి.
సమాజం ఎందుకు మౌనంగా ఉంటోంది?
బాధితులు తమపై జరుగుతున్న అన్యాయాన్ని బయటకు చెప్పుకోవడానికి ఇప్పటికీ వెనుకాడుతున్నారు. డెహ్రాడూన్ కేసులోనే.. పది నెలల పాటు ఆ ఇరుగుపొరుగు వారు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఆ నిశ్శబ్దాన్ని గమనించలేకపోయారు. కుటుంబ గౌరవం, పిల్లల భవిష్యత్తు, సమాజం ఏమనుకుంటుంది? అనే సామాజిక ఒత్తిళ్లు బాధితులను మూగబోయేలా చేస్తున్నాయి. చాలా సందర్భాలలో పుట్టింటి వారు కూడా సర్దుకుపోవాలి అని సలహా ఇవ్వడమే ఈ నేరాలు ఇంత తీవ్రరూపం దాల్చడానికి కారణమవుతోంది.
పరిష్కార మార్గాలు మరియు చట్టపరమైన రక్షణ
భారతదేశంలో గృహ హింస నుండి మహిళల రక్షణ చట్టం-2005 (DV Act) బాధితులకు బలమైన రక్షణ కల్పిస్తోంది. శారీరక, మానసిక, ఆర్థిక వేధింపులన్నింటినీ ఈ చట్టం పరిధిలోకి తెచ్చారు. హింసను భరించడం సంస్కారం కాదు. తొలి దశలోనే ప్రతిఘటించకపోతే, అది డెహ్రాడూన్ ఘటన తరహాలో ప్రాణాంతకంగా మారుతుంది.
మనం ఏం చేయాలి?
వేధింపులు ప్రారంభమైనప్పుడే కుటుంబ సభ్యులకు, స్నేహితులకు లేదా లీగల్ సెల్స్‌కు సమాచారం ఇవ్వాలి. హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించాలి: అత్యవసర సమయాల్లో జాతీయ మహిళా కమిషన్ హెల్ప్‌లైన్ 112 లేదా 181 ను సంప్రదించవచ్చు.ఇరుగుపొరుగున ఎవరైనా నిరంతరం గొడవలు పడుతూ, డిప్రెషన్‌లోకి వెళ్తుంటే వారిని పరామర్శించడం, అవసరమైతే పోలీసులకు సమాచారం అందించడం మన బాధ్యతగా భావించాలి.













Click it and Unblock the Notifications