హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ప్రచారం చేస్తారని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ చెప్పారు. ఆయన శనివారం ఉదయం హైదరాబాదుకు వచ్చారు. అందరు పార్లమెంటు సభ్యుల మాదిరిగానే జగన్ సేవలను కూడా వినియోగించుకుంటామని ఆయన మీడియా ప్రతినిధులతో చెప్పారు. నోటిఫికేషన్ వెలువడిన తర్వాత పులివెందుల శాసనసభా సీటుకు అభ్యర్థిని ఖరారు చేయనున్నట్లు ఆయన తెలిపారు. మీడియా ఒత్తిడి వల్లనే కొండా సురేఖ మంత్రి పదవికి రాజీనామా చేశారని ఆయన అన్నారు.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించి తీరుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పార్టీ గెలిపించాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్త మీదా ఉందని ఆయన చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై చర్చించేందుకు మాత్రమే తాను హైదరాబాద్ వచ్చినట్లు ఆయన తెలిపారు. అభ్యర్థుల ఎంపిక విషయాన్ని రాష్ట్ర పార్టీ నాయకత్వమే చూసుకుంటుందని ఆయన చెప్పారు. మజ్లీస్ తో పొత్తుపై పార్టీ నాయకులతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని అన్నారు.