• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

అధిష్టాన వర్గం ఎలా చెబితే అలా: రోశయ్య

By Santaram
|

Rosaiah
న్యూఢిల్లీ: అధిష్టానవర్గం ఆదేశాలను పాటించడానికే తాను ఢిల్లీకి వచ్చానని ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య అన్నారు. మూడు రాష్ట్రాల ఎన్నికల హడావిడి, రాష్ట్రంలో వరదల పరిస్థితి వల్లనే తాను ఇన్ని రోజులు ఢిల్లీ రాకపోయానని ఆయన చెప్పారు. కేంద్రం నుంచి వరద సహాయ చర్యలకు అత్యధిక నిధులు రాబట్టడమే తన పర్యటన ప్రధాన ఉద్దేశమని అన్నారు. పార్టీ అధ్యక్షురాలు ఇచ్చే సమయాన్ని బట్టి సీఎల్పీ సమావేశం, ఇతర రాజకీయ అంశాలపై ఆమెతో చర్చిస్తానని తెలిపారు. శుక్రవారం రాత్రి ఢిల్లీ చేరుకున్న రోశయ్య విమానాశ్రయంలో విలేఖరులతో కొద్ది సేపు మాట్లాడారు.

అనంతరం ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ చార్జ్‌ వీరప్ప మొయిలీ నివాసానికి వెళ్లి ఆయనతో దాదాపు అరగంట సేపు రాష్ట్ర రాజకీయ పరిస్థితి గురించి చర్చించారు. గ్రేటర్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ లో అసంతృప్తి తలెత్తడం సహజమేనని, ఆయన అన్నారు. తనకు తెలిసినంతవరకూ ఇలాంటివి కొత్త కాదని అన్నారు. పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే స్థానిక ఎన్నికల్లో పోటీ ఎక్కువ ఉంటుందన్నారు. కాంగ్రెస్‌కు ప్రజాదరణ ఎక్కువ కనుకనే పోటీ చేయాలనుకున్న వారు ఎక్కువయ్యారని సూత్రీకరించారు.

మొయిలీతో భేటీ అనంతరం విలేఖరులతో మాట్లాడిన రోశయ్య..గ్రేటర్‌ ఎన్నికల్లో విజయం సాధించడానికి అనుసరించాల్సిన వ్యూహ రచనపై చర్చించినట్లు చెప్పారు. వైఎస్‌ మరణం తర్వాత జగన్‌ సీఎం కావాలని కొందరు కోరుకోవడం నేరం కాదని, జగన్‌ కూడా ఉత్సాహం చూపారని, అయితే అధిష్ఠానం నిర్ణయం ప్రకారమే ఎవరైనా నడుచుకోవాలని చెప్పారు. అధిష్ఠానం ఆదేశాల మేరకే తాను సీఎం పదవిలో ఉన్నానని, అధిష్ఠానం ఏక్షణాన్నైనా ఈ పదవిని జగన్‌ సహా ఎవరికి అప్పగించినా..తప్పుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. కొండా సురేఖ రాజీనామా వ్యవహారాన్ని విలేఖరులు ప్రస్తావించగా ఆ విషయంపై తాను వీధుల్లో మాట్లాడనని అన్నారు.

శనివారం ఉదయం 9-45గంటలకు రోశయ్య హోంమంత్రి చిదంబరంతోనూ, మధ్యాహ్నం 1.00కు రక్షణమంత్రి ఆంటోనీతోనూ భేటీ కానున్నారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ప్రధానమంత్రి మన్మోహన్‌ తోనూ ఆయన సమావేశమయ్యే అవకాశాలున్నాయి. రాత్రి 8 గంటలకు ఆయన మళ్లీ హైదరాబాద్‌కు తిరుగుపయనం కానున్నారు. ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌ రెడ్డి, హిందీ అకాడమీ చైర్మన్‌ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌, రాజసభ సభ్యుడు గిరీశ్‌ సంఘీ ప్రభృతులు రోశయ్యతో పాటు ఢిల్లీ వచ్చారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X