హైకమాండ్ ఎలా చెబితే అలా నడుచుకుంటా: రోశయ్య

ఐదేళ్లు సీఎం పదవిలో ఉంటారా అన్న ప్రశ్నకు ఎన్ని సంవత్సరాలు పనిచేస్తాననడానికి కాలపరిమితి అంటూ ఉండదని అన్నారు. జగన్ వర్గం కార్యకలాపాల గురించి సోనియా ఆరా తీశారని వెల్లడించారు. సాయంత్రం జగన్ కూడా మిమ్మల్ని కలుస్తున్నారని చెప్పినప్పుడు వారి కుటుంబానికి అపాయింట్‌మెంట్ ఇచ్చినట్లు ఆమె చెప్పారని తెలిపారు. పార్టీని కలిసికట్టుగా, సంఘటితంగా ఉంచే బాధ్యతను అధిష్ఠానం తనపై ఉంచిందని చెప్పారు. 33 మంది కాంగ్రెస్ ఎంపీలను అందించిన ఆంధ్రప్రదేశ్ తమకు ముఖ్యమైన రాష్ట్రమని ఆమె చెప్పారని వెల్లడించారు. సీఎల్పీ సమావేశం గురించి తనను ఆరా తీశారని, హైకోర్టులో ఈ అంశంపై ప్రజాహిత వ్యాజ్యం ఉందని చెప్పానని తెలిపారు.
ఈ విషయంపై కేంద్ర న్యాయ శాఖ మంత్రి వీరప్ప మొయిలీతో మాట్లాడి తగిన నిర్ణయం తీసుకుంటానని మేడమ్ చెప్పినట్లు వెల్లడించారు. త్వరలోనే సీఎల్పీ సమావేశ తేదీని ఆమె నిర్ణయించవచ్చని చెప్పారు. మంత్రివర్గ విస్తరణ గురించి తాను చర్చించలేదని, మొదటి పర్యటనలోనే అన్ని అధికారాలను తనకు ఇవ్వాలని కోరలేకపోయానని అన్నారు. విస్తరణ అవసరమని భావిస్తే తాను అధిష్ఠానం సలహా కోరతానని స్పష్టం చేశారు. తాను, జగన్ కుటుంబం ఒకే రోజు వేర్వేరు సమయాల్లో మేడమ్‌ను కలుసుకోవడంలో రాజకీయ ప్రాధాన్యతేమీ లేదని, యాదృచ్ఛికంగా జరిగిందని అన్నారు.
కొండా సురేఖ రాజీనామా సమర్పించడం, మరికొంతమంది రాజీనామాలు చేస్తానని హెచ్చరించడంపై సోనియా వద్ద ప్రస్తావించడం అనవసరమనుకున్నామని తెలిపారు. పీఆర్పీతో పొత్తు విషయంలో గందరగోళం ఏమీ లేదని చెప్పారు. తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదని, ఈ విషయంలో పార్టీ వైఖరి మారలేదని స్పష్టం చేశారు. తెలంగాణపై కమిటీకి త్వరలో మరో కన్వీనర్‌ను నియమించి, పునర్వ్యవస్థీకరిస్తానని వెల్లడించారు.












Click it and Unblock the Notifications