ముంబై: నిరుటి ముంబై దాడులపై చేసిన ఆరోపణల మీద వినీత్ కామ్టె వివరణ ఇవ్వకపోతే తాను రాజీనామా చేస్తానని ముంబై జాయింట్ పోలీసు కమిషనర్ (క్రైం) హెచ్చరించారు. ముంబై దాడుల్లో మరణించిన ఐపిఎస్ అధికారి అశోక్ కామ్టే భార్య వినీత ది లాస్ట్ బుల్లెట్ పేర రాసిన పుస్తకంలో రాకేష్ మారియాపై ఆరోపణలు చేశారు. దీనిపై అశోక్ మారియా శుక్రవారం తీవ్రంగా ప్రతిస్పందించారు. కామా అస్పత్రికి తన భర్త వెళ్లే విషయంలో మారియా సరిగా సలహా ఇవ్వలేదని కామ్టే ఆరోపించారు. కామ్టే ఆరోపణలపై రాష్ట్ర హోం మంత్రి ఆర్ఆర్ పాటిల్ కు రాకేష్ మారియా లేఖ రాసినట్లు సమాచారం. కామ్టేపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరినట్లు చెబుతున్నారు. ఈ విషయంపై మంత్రిని కలుస్తానని కూడా ఆయన చెప్పారు. కామ్టే ఆరోపణలు నిరాధారమని, తన వైపు వాదనను కూడా వినాలని ఆయన అన్నారు. సమాచారాన్ని తాను ఆర్టీఐ ద్వారా పొందినట్లు కామ్టే చెబుతున్నారు. తాను నిజాయితీగా పుస్తకం రాసినట్లు ఆమె ఒక టీవీ చానెల్ తో చెప్పారు. ఈ పుస్తకాన్ని ప్రముఖ రచయిత్రి అరుంధతీ రాయ్, ముంబై మాజీ పోలీసు కమిషనర్ జూలియో రెబీరో మంగళవారంనాడు విడుదల చేశారు.