హైదరాబాద్: తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం మానవ హక్కులను కాలరాస్తోందని, అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ల్లోని తెలంగాణవాసులు విమర్శించారు. ఈ మేరకు ఎన్నారైల ప్రతినిధులు సోమవారం కాన్ బెర్రాలోని భారత హై కమిషనర్ కు ఒక వినతిపత్రం సమర్పించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని విద్యార్థులపై ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించిందని వారు తప్పు పట్టారు. ప్రభుత్వం తెలంగాణ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోందని, హింసాత్మక వాతావరణాన్ని కల్పిస్తోందని వారు విమర్శించారు.
ప్రభుత్వ అప్రజాస్వామిక చర్యలను ఖండించాలని వారు తెలుగుదేశం, సిపిఐ, సిపిఎం, ప్రజారాజ్యం పార్టీలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావును బేషరతుగా విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలని వారు యుపిఎ ప్రభుత్వాన్ని కోరారు. వినోద్, దేవేందర్, పాపిరెడ్డి, రామకృష్ణ, నర్సింగ రావు, సిహెచ్ కిషన్, జయపాల్, నరేష్, అశోక్, మాధవ్, ఇంద్రసేనా రెడ్డి, రవికాంత్, రాజశేఖర్, వేణుగోపాల రెడ్డి, నవీన్, శ్రావణ్, పవన్, ఉపేందర్ తదితర తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం ఆస్ట్రేలియా చాప్టర్ సభ్యులు ఇందులో ఉన్నారు.