హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.రోశయ్య, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ల సమక్షంలోనే ఇద్దరు పార్టీ సీనియర్లు పరస్పరం కలహించుకున్నారు. వి. హనుమంతరావు, కెవిపి రామచందర్ రావు పరస్పరం నువ్వెంత అంటే నువ్వెంత అని దుమ్మెత్తి పోసుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గెలిచినవారితో సోమవారం సాయంత్రం కాంగ్రెసు కార్యాలయం గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ గొడవ చోటు చేసుకుంది. సమావేశం నుంచి కొందరు మంత్రులు అర్థాంతరంగా వెళ్లిపోవడంపై విహెచ్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. ముఖ్యమంత్రికి మంత్రులు తగిన గౌరవం ఇవ్వడం లేదని, వైయస్ రాజశేఖర రెడ్డికి ఇచ్చిన గౌరవం రోశయ్యకు కూడా ఇవ్వాలని హనుమంతరావు అన్నారు. ఆ సమయంలో కెవిపి రామచందర్ రావు జోక్యం చేసుకున్నారు.
మంత్రులు చెప్పే వెళ్లారని కెవిపి అనడంతో హనుమంత రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నీకు చెప్పి వెళ్తే సరిపోతుందా, నువ్వు పార్టీలో ముఠాలు కడుతున్నావు అని అన్నారు. తాను పిసిసి అధ్యక్షుడిగా, యువజన కాంగ్రెసు అధ్యక్షుడిగా పనిచేశానని, నీ స్థాయి ఎంత అని విహెచ్ కెవిపిపై విరుచుకు పడ్డారు. దానికి కెవిపి కూడా తీవ్ర స్వరంతో సమాధానం చెప్పారు. ఢిల్లీలో నువ్వు ఏం చేస్తున్నావో నాకు తెలియదా అని కెవిపి విహెచ్ ను ఉద్దేశించి అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు నువ్వేం చేశావో నాకు తెలియదా అని విహెచ్ అన్నారు. ఈ స్థితిలో డి. శ్రీనివాస్ జోక్యం చేసుకోవడం సమస్య సద్దుమణిగింది.