విపరీతంగా నిద్ర వస్తుందా? కారణాలు ఇవే కావచ్చు.. జాగ్రత్త!
ఎల్లప్పుడూ నిద్రమత్తుగా ఉండటం చాలా మందిని ఆందోళనకు గురి చేస్తోంది. ఇది సాధారణ అలసట కాదు. శరీరంలో దాగి ఉన్న కొన్ని ఆరోగ్య సమస్యలకు సంకేతం కావచ్చుఅంటున్నారు వైద్య నిపుణులు. వారాల తరబడి ఈ సమస్య కొనసాగితే తప్పకుండా వైద్య సలహా తీసుకోవాలి అని సూచిస్తున్నారు.
నిద్రమత్తు vs సాధారణ అలసట
సాధారణ అలసట కొంత విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతుంది. కానీ నిరంతర నిద్రమత్తు ఎంత నిద్రపోయినా తగ్గదు. పని చేస్తున్నప్పుడు, డ్రైవ్ చేస్తున్నప్పుడు కూడా కళ్లు మూసుకుపోవడం, పగటిపూట భారంగా అనిపించడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇది అనారోగ్య సూచకం. దీనిని అసలే నిర్లక్ష్యం చేయకూడదు.

ఎప్పుడూ నిద్ర.. ప్రధాన కారణాలు
నిద్రలేమి, థైరాయిడ్ సమస్యలు, మధుమేహం, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు నిద్రమత్తుకు ప్రధాన కారణాలు. కొన్ని మందులు కూడా ఈ సమస్యను పెంచుతాయి. అంతేకాకుండా స్లీప్ అప్నియా వంటి నిద్ర రుగ్మతలు కూడా గాఢమైన నిద్రకు భంగం కలిగిస్తాయి. సమయం కాని సమయంలో నిద్ర ఫీలింగ్ కలిగిస్తాయి.
అనారోగ్యకరమైన నిద్ర లక్షణాలు
పగటిపూట మగత, ఉదయం తలనొప్పి, బిగ్గరగా గురక, ఆకస్మికంగా నిద్రపోవడం, ఏకాగ్రత లోపం, ఆసక్తి తగ్గడం వంటివి ముఖ్య లక్షణాలు. ఈ సంకేతాలు కనిపిస్తే వాటిని విస్మరించకూడదు. నిద్రమత్తు రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. డ్రైవింగ్‌లో ఇబ్బంది, చదువులో తక్కువ మార్కులు, పనిలో తప్పులు జరగడం వంటివి హెచ్చరిక సంకేతాలు. నిరంతర నిద్రమత్తును సాధారణ విషయంగా తీసుకోవద్దు. ఆరోగ్యంపై శ్రద్ధతో చాలా సమస్యలను ముందుగానే అరికట్టవచ్చు.
నివారణకు చిట్కాలు
ప్రతిరోజూ ఒకే సమయంలో నిద్రపోయి, మేల్కొనే అలవాటు చేసుకోవాలి. రాత్రి భారీ భోజనం, కాఫీ, టీ తగ్గించాలి. పడుకోవడానికి ఒక గంట ముందు మొబైల్, టీవీ వాడకం నియంత్రించాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. అప్పుడే ఈ సమస్య నుండి కాస్త ఉపశమనం లభిస్తుంది. వైద్యులు రక్త పరీక్షలు, థైరాయిడ్, చక్కెర స్థాయిలు తనిఖీ చేస్తారు. అవసరమైతే స్లీప్ ల్యాబ్‌లో నిద్ర పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. సకాలంలో గుర్తించి చికిత్స చేస్తే ఈ సమస్యను పూర్తిగా అధిగమించవచ్చు.













Click it and Unblock the Notifications