మెగా కోడలికి సరికొత్త బాధ్యతలు.. రూ.8,600 కోట్లతో భారీ ప్రాజెక్ట్
దేశంలోని ప్రముఖ ఆరోగ్య రంగ సంస్థ అపోలో హాస్పిటల్స్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ సతీమణి, అపోలో సీఎస్ఆర్ వైస్ చైర్‌పర్సన్ అయిన ఉపాసన కొణిదెల ఇప్పుడు సరికొత్త బాధ్యతలను అందుకోనున్నారు. అపోలో ఆసుపత్రుల 'ప్రాజెక్ట్స్ డైరెక్టర్'గా ఆమె నియామకం ఖరారైంది. దేశవ్యాప్తంగా అపోలో చేపట్టబోయే నూతన ఆసుపత్రుల నిర్మాణాలు, మౌలిక వసతుల అభివృద్ధిని ఇకపై ఆమె దగ్గరుండి పర్యవేక్షించనున్నారు.
భారీ పెట్టుబడులు.. కీలకమైన బాధ్యతలు
ప్రస్తుతం అపోలో ఆసుపత్రులు రూ.8,600 కోట్ల భారీ పెట్టుబడితో దేశవ్యాప్తంగా తమ విస్తరణ ప్రణాళికలను వేగవంతం చేశాయి. ఈ నేపథ్యంలో ఉపాసన నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది. కంపెనీ మేనేజ్‌మెంట్, ప్రాజెక్ట్ భాగస్వాములతో కలిసి ఆమె దేశవ్యాప్తంగా ఆసుపత్రుల నిర్మాణాలను అమలు చేయడంలో కీలక పాత్ర పోషిస్తారు. కేవలం కొత్త ఆసుపత్రుల విస్తరణే కాకుండా, ఇప్పటికే ఉన్న మౌలిక సదుపాయాల రూపకల్పన, రోగులకు మెరుగైన వాతావరణం కల్పించేలా డిజైన్లలో ఏకరూపతను నిర్వహించడం ఆమె బాధ్యతలలో ప్రధానమైనవి.

తాత గారి ఆశయ సాధనే లక్ష్యంగా అడుగులు
అపోలో ఆసుపత్రుల వ్యవస్థాపకులు, తన తాతగారైన డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డి కన్న కలలను ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యానని ఉపాసన పేర్కొన్నారు. భారతదేశంలో ప్రతి ఒక్కరికీ ప్రపంచ స్థాయి వైద్యం అందుబాటులో ఉండాలనేదే ఆయన ప్రధాన నమ్మకమని, ఆ నమ్మకాన్ని తాము నిర్మించే ప్రతీ ఆసుపత్రిలో ప్రతిబింబించేలా బాధ్యత నిర్వర్తిస్తానని ఆమె తెలిపారు. ఆసుపత్రి డిజైన్లు రోగులకు ఎలాంటి గందరగోళం లేకుండా, కుటుంబాలకు మనోధైర్యాన్ని ఇచ్చేలా ఉండాలని ఆమె అభిప్రాయపడ్డారు.
వ్యాపార రంగంలోనూ దూసుకెళ్తున్న ఉపాసన
అపోలో ఆసుపత్రుల బాధ్యతలతో పాటు ఉపాసన ఇతర రంగాల్లోనూ తన సత్తా చాటుతున్నారు. భారతదేశంలో డిజిటల్ వెల్నెస్, కార్పొరేట్ హెల్త్‌కేర్ ప్లాట్‌ఫారమ్ అయిన 'యూఆర్‌లైఫ్' (URLife) సంస్థకు ఆమె వ్యవస్థాపకురాలిగా మరియు మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. అపోలో సీఎస్ఆర్ కార్యకలాపాలలోనూ ఆమె క్రియాశీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు. వ్యక్తిగత జీవితంలో ఇటీవల కవల పిల్లలకు జన్మనిచ్చిన ఉపాసన, అటు కుటుంబ బాధ్యతలతో పాటు ఇటు కార్పొరేట్ రంగాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.














Click it and Unblock the Notifications
