ఖమ్మం: ఖమ్మంలోని కాంగ్రెసు నేత రేణుకా చౌదరి ఇంటిపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కార్యకర్తలు దాడి చేశారు. ఈ దాడిలో ఆమె ఇల్లు పాక్షికంగా దెబ్బ తిన్నది. ఆమె క్యాంపు కార్యాలయంపై కూడా దాడి చేసేందుకు ప్రయత్నించారు. అయితే స్థానికులు అడ్డుకోవడంతో విరమించుకున్నారు. రేణుకా చౌదరి క్యాంపు కార్యలయంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. దాంతో ఆమె కార్యాలయం పాక్షికంగా దెబ్బ తిన్నది. సంఘటనా స్థలంలో తెరాస కార్యకర్తలు ఒక లేఖను వదిలిపెట్టారు.
రేణుకా చౌదరిని తెలంగాణ ద్రోహిగా ఆ లేఖలో అభివర్ణించారు. తెలంగాణకు వ్యతిరేకంగా రేణుకా చౌదరి వ్యవహరిస్తున్నారని తెరాస కార్యకర్తలు ఆగ్రహంతో ఉన్నారు. తెరాస బుధవారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. మరింత కాంగ్రెసు నాయకుల ఇళ్లపై దాడులు జరగవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. ఈ విషయంపై మాట్లాడడానికి రేణుకా చౌదరి అందుబాటులో లేరు.