తెలంగాణ ఉద్యమం ఐటి పరిశ్రమకు పెద్ద శాపం

తెలంగాణ వాదులు ముఖ్యంగా కార్లు, బస్సులపై రాళ్లు రువ్వడం.. అద్దాలు పగలగొట్టడం వంటి విధ్వంసకర చర్యలు ఆయా కంపెనీల యాజమాన్యాలు, ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. ఇక్కడ జరుగుతున్న విధ్వంసకర పరిణామాలకు సంబంధించి హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సులేట్ ప్రతిరోజూ నివేదికలు పంపుతోందని ప్రభుత్వంలోని ఓ ఉన్నతాధికారి తెలిపారు.
ఈ పరిణామాలన్నీ దేశ, విదేశాల్లో రాష్ట్ర ఐటీ రంగానికి, హైదరాబాద్‌కు ఉన్న పేరు ప్రతిష్ఠలను దెబ్బతీసేలా ఉన్నాయని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఆదివారం విలేఖరుల సమావేశంలో మాట్లాడిన సీఎం రోశయ్య కూడా నగరంలో చోటుచేసుకుంటున్న ఘటనలు ఐటీ రంగంపై ప్రభావం చూపించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
హైదరాబాద్‌లో పెద్దఎత్తున ఉన్న ఐటీ కంపెనీల ఉద్యోగులను చేరవేసేందుకు ప్రతిరోజూ వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. ఈ వాహనాల ద్వారా కూడా వేల మంది ఉపాధి పొందుతున్నారు. మాంద్యం దెబ్బకు అసలే అంతంతమాత్రంగా ఉన్న ఐటీ రంగానికి తాజా పరిణామాలు ఏమాత్రం రుచించటం లేదని చెబుతున్నారు. ఐటీ రంగాన్ని లక్ష్యంగా చేసుకుని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో చేపట్టిన నిర్మాణాల్లో సుమారు 50 లక్షల చదరపు అడుగుల స్థలం ఖాళీగా పడి ఉంది. ఈ స్థలం ఎప్పుడు భర్తీ అవుతుందా? అని డెవలపర్లు వేయి కళ్లతో ఎదురుచూస్తున్న సమయంలో నగరంలో జరుగుతున్న హింసాత్మక ఘటనలు వీరిలో కూడా భయాందోళనలు పెంచుతున్నాయని ఐటీ వర్గాలు తెలిపాయి.












Click it and Unblock the Notifications