తెలంగాణ అంతటా కొనసాగుతున్న ఆందోళనలు

హైదరాబాదులోని మౌలాలిలో ఆందోళనకారులు పుష్ పుల్ రైలును ఆపేశారు. మంత్రి దానం నాగేందర్ ఇంటిని విద్యార్థులు ముట్టడించారు. ఆదిలాబాదు జిల్లాలోని తహసీల్దార్, సబ్ ట్రెజరీ కార్యాలయాలను తెలంగాణ జెఎసి నేతలు ముట్టడించారు. కరీంనగర్ జిల్లా మెట్ పల్లి లో వేలాది మంది విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. రోడ్డుకిరువైపులా మానవ హారం చేపట్టారు. దీంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో సోనియా, రోశయ్య దిష్టిబొమ్మలను, మంత్రుల దిష్టిబొమ్మలను దున్నపోతులపై ఊరేగించి నిరసన తెలిపారు. బిజినేపల్లిలో ఆర్ఎస్ఎస్, బిజెపి కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు.
నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం నీలాలో తెరాస, సిపిఐ, న్యూడెమొక్రసీ కార్యకర్తలు ఎంపిపి ఇంటిని ముట్టడించారు. హైదరాబాదులో బిజెపి కార్యకర్తలు ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ ను ముట్టడించారు. అసెంబ్లీకి వెళ్లకుండా శాసనసభ్యులను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. తెలంగాణలోని విశ్వవిద్యాలయాల్లో ఆందోళనలు సాగుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితిలో తెలంగాణకు అదనంగా 9 కంపెనీల కేంద్ర బలగాలు చేరుకున్నాయి.












Click it and Unblock the Notifications