హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తీర్మానం ప్రతిపాదించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) సభ్యులు మంగళవారం శాసనసభలో ఆందోళనకు దిగారు. దీంతో సభా కార్యక్రమాలు స్తంభించాయి. తాను ఎంత చెప్పినా తెరాస సభ్యులు వినకపోవడంతో సభను స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి రేపటికి వాయిదా వేశారు. తెలంగాణ అంతటా ఆందోళనలు సాగుతుంటే సభలో కరవు, వరదలపై చర్చిస్తారా, తెలంగాణ తీర్మానం ప్రతిపాదించిన తర్వాతనే ఏదైనా జరగాలని తెరాస సభ్యులు పట్టుబట్టారు. విశ్వవిద్యాలయాల్లో పారుతున్న రక్తపుటేరులు ప్రభుత్వానికి పట్టవా అని తెరాస శాసనసభా పక్ష నాయకుడు ఈటెల రాజేందర్ ప్రశ్నించారు.
తెలంగాణ తీర్మానం చేయకపోతే తెలంగాణలో రేపటి నుంచి కాంగ్రెసు శాసనసభ్యులు తిరగలేరని ఆయన హెచ్చరించారు. తెరాస శాసనసభ్యుడు హరీష్ రావు ప్లకార్లుడు చింపి స్పీకర్ పైకి విసిరేశారు. అసెంబ్లీ లాబీలో జై తెలంగాణ నినాదాలు చేశారు. అంతకు ముందు శాసనసభ సమావేశం కాగానే తెరాస సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో అప్పుడు సభను స్పీకర్ 15 నిమిషాలు వాయిదా వేశారు. ఆ తర్వాత తిరిగి సమావేశమైన తర్వాత కూడా సభ సద్దుమణగలేదు. దీంతో మరో అరగంట పాటు సభను స్పీకర్ వాయిదా వేశారు. రెండు సార్లు వాయిదా పడిన తర్వాత తిరిగి సమావేశమైనా పరిస్థితిలో మార్పు లేకపోవడం స్పీకర్ సభను బుధవారానికి వాయిదా వేశారు.