హైదరాబాద్: రాష్ట్ర ఆరోగ్య మంత్రి దానం నాగేందర్ ఇంటిని మంగళావరం ముట్టడించారు. ఈ సమయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థులు నాగేందర్ నివాసంలోకి చొచ్చుకుపోవడానికి ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డగించారు. దానం అనుచరులు ప్రతిగా విద్యార్థులపై ఎదురుదాడికి దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దానం అనుచరులు మీడియా ప్రతినిధులపై కూడా దాడి చేశారు. ఈ దాడిలో మీడియా ప్రతినిధి ఒకరు గాయపడ్డారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే గ్రేటర్ హైదరాబాదును విడిగా చేయాలని దానం నాగేందర్ సోమవారం జరిగిన కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ (సిఎల్పీ) సమావేశంలో అభిప్రాయపడ్డారు. గ్రేటర్ హైదరాబాదు కోసం తాము పోరాటం చేస్తామని కూడా ఆయన చెప్పారు. దీంతో తెలంగాణ విద్యార్థులు దానం నాగేందర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో దానం నాగేందర్ ఇంటిని విద్యార్థులు ముట్టడించారు. తెలంగాణ మంత్రులను, శాసనసభ్యులను తాము నిలదీస్తామని తెలంగాణ విద్యార్థుల సంఘం సంయుక్త కార్యాచరణ సమితి (జెఎసి) నాయకులు చెప్పారు.