హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును డిమాండ్ చేస్తూ ఈ నెల 10వ తేదీన విద్యార్థులు తలపెట్టిన అసెంబ్లీ ముట్టడిని భగ్నం చేసేందుకు పకడ్బందీ వ్యూహాన్ని చేపట్టారు. అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని శాంతిర్యాలీగా మార్చినా పోలీసులు అనుమతి నిరాకరించారు. ఎక్కడికక్కడ అరెస్టులు చేసేందుకు రంగం సిద్ధమైంది. కేంద్రం నుంచి 20 ప్లటూన్ల బలగాలను వచ్చాయి. ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులను ఖాళీ చేయించే ప్రయత్నం చేశారు. అయినా విశ్వవిద్యాలయాల్లో కొంత మంది విద్యార్థులున్నారు. విద్యార్థులను పోలీసులు అరెస్టు చేస్తూనే ఉన్నారు. ఎమ్మార్పీయస్ కార్యకర్తలను కూడా పోలీసులు అరెస్టు చేస్తున్నారు. మొత్తం ఆపరేషన్ కు విజిలెన్స్ ఐజి అనురాధ నేతృత్వం వహిస్తున్నారు.
తెలంగాణ అంతటా 144 సెక్షన్ విధించారు. జిల్లాల నుంచి ఈ నెల 10వ తేదీన ఎవరూ హైదరాబాద్ రావద్దని అనురాధ ఆదేశించారు. బుధవారం సాయంత్రానికి మరిన్ని బలగాలు హైదరాబాదుకు చేరుకునే అవకాశం ఉంది. హైదరాబాదులో మంగళవారం సాయంత్రం నుంచే కర్ఫ్యూ వాతావరణం నెలకొని ఉంది. పెట్ర్లోల్ బంకులు చాలా వరకు మూత పడ్డాయి. హైదరాబాదులో ప్రజానీకం తీవ్ర భయాందోళనలో ఉన్నారు. విశ్వవిద్యాలయాల్లో హాస్టళ్లు మూసేశారు. విశ్వవిద్యాలయాల గేట్లకు తాళాలు వేశారు.