న్యూఢిల్లీ: తెలంగాణపై తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ న్యాయం చేస్తారని సర్వే సత్యనారాయణ తదితర కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యురాలు తెలిపారు. వారు బుధవారంనాడు సోనియాకు కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి తెలంగాణపై నిర్ణయం తీసుకోవాలని కోరారు. జన్మ దిన కానుకగా తెలంగాణ నిర్ణయాన్ని ప్రకటించాలని తాము సోనియాను కోరినట్లు సర్వే తెలిపారు. తనకు అన్నీ తెలుసునని, ఓపిక పట్టాలని, న్యాయం చేస్తానని, సంయమనం పాటించాలని సోనియాతో తమతో అన్నట్లు ఆయన మీడియా ప్రతినిధులతో చెప్పారు.
సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని సోనియా చెబుతూ వచ్చారని, ఇప్పుడు సరైన సమయం వచ్చిందని సోనియా భావిస్తున్నారని ఆయన అన్నారు. ప్రస్తుత పరిస్థితుల పట్ల బాధ పడుతున్నారని ఆయన చెప్పారు. తెలంగాణకు సోనియా సానుకూలంగా ప్రతిస్పందిస్తారని ఆయన చెప్పారు. విద్యార్థులు సంయమనం పాటించాలని కాంగ్రెసు తెలంగాణ ఎంపీలు కోరారు. దీక్ష విరమించాలని వారు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును కోరారు.