విజయవాడ: ఆంధ్రప్రదేశ్ విభజన కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం కుట్ర అని తెలుగుదేశం శాసనసభ్యుడు దేవినేని ఉమా మహేశ్వర రావు ఆరోపించారు. జాతీయ భద్రతా సలహాదారు నారాయణన్, హోం శాఖ కార్యదర్శి జికె పిళ్లైలతో కలిసి చిదంబరం ఆంధ్రప్రదేశ్ విభజనకు కుట్ర చేస్తున్నారని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వ్యాఖ్యానించారు. దక్షిణ భారతదేశంలో అతి పెద్ద రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండడం ఇష్టం లేక రాష్టాన్ని చీల్చేందుకు రాజకీయ కుట్ర చేశారని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రాన్ని చీల్చే హక్కు కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి, కాంగ్రెసు నేతలు వీరప్పమొయిలీ, చిదంబరాలకు ఎవరిచ్చారని ఆయన ప్రశ్నించారు. తాము సమైక్యంగా ఉండాలని కోరుకుంటుంటే ఏకపక్ష నిర్ణయాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.
కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు రాజీనామాలు చేసి సమైక్యాంధ్ర కోసం ఉద్యమాలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చిదంబర రహస్యాన్ని బయట పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో బలంగా ఉద్యమం సాగుతుంటే నిఘా వర్గాలు ప్రశాంతంగా ఉన్నాయని తప్పుడు నివేదికలు ఇస్తున్నాయని ఆయన అన్నారు. 1969లో ఇంత కన్నా పెద్ద ఉద్యమం చెలరేగినా ఇందిరా గాంధీ రాష్ట్ర విభజనకు అంగీకరించలేదని, రాజీవ్ గాంధీ బుందేల్ ఖండ్ కు అంగీకరించలేదని ఆయన అన్నారు. తమ ప్రజల అభీష్టం మేరకు శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఉద్యమం చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి