ఆంధ్ర, సీమలో కొనసాగుతున్న ఆందోళనలు

నెల్లూరు జిల్లాలో నిరసనకారులు కండలేరు రిజర్వాయరుకు చేరుకుని తమిళనాడుకు 'తెలుగుగంగ'ను ఆపివేశారు. విజయవాడ కనకదుర్గమ్మ వారధి వద్ద నిర్వహించిన భారీ మానవహారంతో జాతీయ రహదారిలో వాహనాల రాకపోకలకు తీవ్రంగా అంతరాయం కలిగింది. తెలుగుదేశం జిల్లా అధ్యక్షుడు, మైలవరం ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు, నూజివీడు ఎమ్మెల్యే రామకోటయ్య, విజయవాడ మాజీ మేయర్ అనూరాధ నేటి నుంచి విజయవాడలో ఆమరణ దీక్షలు చేపడుతున్నారు.
నాగార్జున, కృష్ణా వర్శిటీల విద్యార్ధులు ఉద్యమాన్ని ఉద్ధృతం చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నివురుగప్పిన నిప్పులా ఉంది. 12 మంది ఏయూ విద్యార్థుల నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఎస్కేయూలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు మధ్యాహ్నం కల్లా జేఎన్‌టీయూకు పాకాయి. తిరుపతి శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం పరిసరాలు కూడా పోలీసుల బూట్లచప్పుడుతో దద్దరిల్లాయి. విద్యార్థి సంఘాలన్నీ ఐక్య కార్యాచరణ కమిటీగా ఏర్పడి రిలే నిరాహారదీ క్షలకు దిగాయి.
కుప్పంలోని ద్రవిడ విశ్వవిద్యాలయం విద్యార్థులు రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. కడప యోగి వేమన విశ్వవిద్యాలయం విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు. కోస్తా ప్రాంతాల్లో స్థానిక ఎమ్మెల్యేలు నిరసనల ప్రదర్శనలకు నాయకత్వం వహించారు. ఉత్తరాంధ్రలోని విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో పాటు తూర్పు గోదావరి జిల్లాలోనూ సమైక్యాంధ్ర ఉద్యమం ఉద్ధృతంగా సాగుతోంది. చాలాచోట్ల రైల్‌రోకోలు, రాస్తారోకోలు జరిగాయి.












Click it and Unblock the Notifications