ఆకాశం నుంచి ఊడిపడ్డ ఉల్క. సైంటిస్టుల చేతికి 450 కోట్ల ఏళ్ల నాటి..
అదో ప్రశాంతమైన సాయంత్రం. ఆకాశం నిర్మలంగా.. రాత్రి జాబిల్లి రాకకు స్వాగతం పలుకుతున్న వేళ ఒక్కసారిగా ఆకాశంలో ఏదో వింత వెలుగు. గంటకు ఏకంగా 51 వేల కిలోమీటర్ల వేగంతో ఒక నిప్పుల ముద్ద భూమి వైపు దూసుకొచ్చింది. భూమిపై నుంచి చూస్తున్న వారికి ఏదైనా మిస్సైల్ పడుతున్న భావన కలిగి భయంతో పరుగులు పెట్టారు. అంతలోనే భారీ శబ్దంతో ఒక ఇంటిపై పడింది.
కట్ చేస్తే.. కప్పును చీల్చుకుంటూ బెడ్‌రూమ్‌లో పడ్డ ఆ రాయి, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైంటిస్టుల మైండ్ బ్లాక్ చేస్తోంది. ఎందుకంటే అది మిస్సైల్ దాడి కాదు. మరే ఇతర బాంబు దాడి కాదు.. అసలు భూమిపై అసలు జీవం ఎలా మొదలైంది? కోట్లాది ఏళ్ల క్రితం నీరు ఎక్కడి నుంచి వచ్చింది? అనే సనాతన ప్రశ్నలకు సమాధానం ఈ చిన్న అంతరిక్ష రాయిలోనే దాగి ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు.

లక్కీగా దొరికిన నిధి.. వర్షం పడకముందే పట్టుకున్నారు!
న్యూజెర్సీలోని హిల్‌స్బరో ప్రాంతంలో పడిన ఈ ఉల్క (Meteorite) బరువు దాదాపు ఒక కిలో ఉంటుంది. సాధారణంగా ఇలాంటి రాళ్లు అడవుల్లోనో, సముద్రాల్లోనో పడిపోతుంటాయి. కానీ, ఇది నేరుగా మనుషులుండే ఇంట్లో పడటంతో, పడిన కొన్ని గంటల్లోనే శాస్త్రవేత్తలు దీన్ని స్వాధీనం చేసుకున్నారు. కాలుష్యం, వర్షపు నీరు తాకకముందే ఇది చేతికి చిక్కడం వల్ల, దీని అసలైన రూపం అస్సలు దెబ్బతినలేదు. మన సౌర కుటుంబం ఏర్పడిన కొత్తలో.. అంటే దాదాపు 450 కోట్ల సంవత్సరాల క్రితం అంతరిక్షం ఎలా ఉండేదో తెలుసుకోవడానికి ఇదొక టైమ్ మెషీన్‌లా దొరికిందని రీసెర్చర్లు సంబరపడిపోతున్నారు.
ఆ రాయిలో ఏముంది?
ఈ రాయిని ల్యాబ్‌లో పెట్టి ముక్కలు చేసి చూసిన సైంటిస్టులకు దిమ్మతిరిగే నిజాలు తెలిశాయి. ఆ ఉల్క లోపల అతి పురాతనమైన ఉప్పు నీటి జాడలు కనిపించాయి. అంతేకాదు, జీవుల పుట్టుకకు అత్యంత కీలకమైన 'అమినో యాసిడ్స్', ఆర్గానిక్ కాంపౌండ్స్ కూడా ఇందులో బయటపడ్డాయి. సాధారణంగా ఇలాంటి అరుదైన కార్బన్ రాళ్లలో సోడియం ఇంత ఎక్కువ మొత్తంలో ఉండటం ఇప్పటివరకు ఎప్పుడూ చూడలేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒకప్పుడు అంతరిక్షంలో తిరిగే పెద్ద పెద్ద గ్రహశకలాల్లో (Asteroids) ఖనిజాలతో కూడిన నీరు ప్రవహించేదని చెప్పడానికి ఇదే బలమైన సాక్ష్యం.
అంతరిక్షంలో జీవముందా? అసలు కథ ఇదీ..
ఈ అమినో యాసిడ్స్ దొరకగానే అంతరిక్షంలో గ్రహాంతరవాసులు ఉన్నారని అర్థం కాదు. కానీ, భూమి పుట్టిన కొత్తలో ఇక్కడ జీవం ఏర్పడటానికి కావాల్సిన బిల్డింగ్ బ్లాక్స్ ఇలాంటి అంతరిక్ష రాళ్ల ద్వారానే భూమికి చేరి ఉంటాయని శాస్త్రవేత్తలు బలంగా నమ్ముతున్నారు. కోట్ల సంవత్సరాల క్రితం ఇలాంటి రాళ్లు వరుసగా భూమిని ఢీకొట్టడం వల్లే, వాటిలోని నీరు, రసాయనాలు కలిసి ఇక్కడ జీవరాశులు పుట్టేందుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడి ఉండవచ్చు.
మార్స్, జూపిటర్ల మధ్య నుంచి జర్నీ!
కెమెరా ఫుటేజ్, ల్యాబ్ రిపోర్టుల ఆధారంగా ఈ రాయి ఎక్కడి నుంచి వచ్చిందో కూడా కనిపెట్టేశారు. అంగారకుడు (Mars), బృహస్పతి (Jupiter) గ్రహాల మధ్య ఉండే ఒక పెద్ద ఆస్టరాయిడ్ బెల్ట్ నుంచి ఇది విడిపోయి భూమి వైపు ప్రయాణమైనట్లు గుర్తించారు. అంతరిక్షం నుంచి పడ్డ రాయి ప్రయాణాన్ని ఇంత పక్కాగా ట్రాక్ చేయడం సైన్స్ చరిత్రలోనే చాలా అరుదు. ఏదేమైనా, ఒకరి ఇంటి కప్పును పగలగొట్టిన ఈ రాయి.. ఇప్పుడు మానవాళి పుట్టుక రహస్యాల కప్పును తెరిచేలా చేసిందని సైన్స్ లోకం హర్షం వ్యక్తం చేస్తోంది.














Click it and Unblock the Notifications