హైదరాబాద్: సమైక్యాంధ్రను కోరుతూ విజయవాడలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న తెలుగుదేశం శాసనసభ్యుడు దేవినేని ఉమా మహేశ్వరరావును పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. దీంతో గురువారం ఆయన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. అంతకు ముందు పోలీసులు దీక్షను భగ్నం చేయడానికి ప్రయత్నించడంతో పంచాయతీరాజ్ అతిథి గృహంలోకి వెళ్లి తలుపులు వేసుకుని ఉమా మహేశ్వర రావు దీక్షను కొనసాగించారు. దీంతో పోలీసులు ఓపిక పట్టారు. ఆ తర్వాత గురువారం పదకొండున్న గంటల ప్రాంతంలో పోలీసులు అతిథి గృహంలోకి చొచ్చుకుని వెళ్లారు. తలుపులు బద్దలు కొట్టి ఉమా మహేశ్వర రావును పోలీసులు అరెస్టు చేశారు.
అంతకు ముందు పోలీసులు అతిథి గృహంలోకి రాకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. ఈ సమయంలో తోపులాట కూడా జరిగింది. దేవినేని అరెస్టును పార్టీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే వారి ప్రయత్నం ఫలించలేదు. ఈ సమయంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. గత నాలుగు రోజులుగా దేవినేని ఉమా మహేశ్వర రావు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి