కుప్పకూలిన బంగారం స్టాక్స్: దెబ్బకొట్టిన ప్రధాని మోదీ స్టేట్ మెంట్
ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు బులియన్ మార్కెట్ ను దెబ్బకొట్టాయి. తీవ్రంగా ప్రభావితం చేశాయి. ప్రత్యేకించి జ్యవెలరీ స్టాక్స్ కుప్పకూలాయి. ఆయా కంపెనీల షేర్లన్నీ ఢమాల్ అయ్యాయి. ఈ ఉదయం స్టాక్ మార్కెట్ ప్రారంభమైన వెంటనే జ్యువెలరీ షేర్లన్నీ కూడా పతనం అయ్యాయి. టైటాన్, కళ్యాణ్ జ్యువెలర్స్, సెన్కో గోల్డ్, గోల్డియం ఇంటర్నేషనల్ వంటి ప్రముఖ బంగారు స్టాక్‌లు భారీ పతనాన్ని చవిచూశాయి.
హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధాని మోదీ చేసిన ప్రసంగానికి పెట్టుబడిదారులు స్పందించడమే ఈ షార్ప్ క్రాష్‌కు ప్రధాన కారణం. సంవత్సరం పాటు బంగారం కొనుగోళ్లను నిలిపివేయాలని మోదీ సూచించారు. బంగారాన్ని కొనకుండా ఉండాలని కోరారు. వర్క్ ఫ్రమ్ హోమ్ పద్ధతులను అవలంబించాలని, దేశీయ లేదా అంతర్జాతీయ అనవసర ప్రయాణాలను తగ్గించుకోవాలని చెప్పారు.

కరోనా సమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్‌లైన్ సమావేశాలు, వీడియో కాన్ఫరెన్స్‌లు వంటి అనేక వ్యవస్థలను అవలంబించామని, వాటికి అలవాటుపడ్డామని కూడా మోదీ గుర్తు చేశారు. ఇప్పుడు కూడా ఆ పద్ధతులను తిరిగి ప్రారంభించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అది జాతీయ ప్రయోజనాలకు అత్యవసరమని, వాటికి మళ్లీ ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్నందున దేశీయ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు భారీ నష్టాలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ కీలక ప్రకటన చేయాల్సి వచ్చింది. సప్లై చైన్ పై ఒత్తిడిని తగ్గించి, ఆర్థిక వ్యవస్థకు ఉపశమనం కల్పించడమే దీని వెనుక ప్రధాన ఉద్దేశ్యం. దీని ప్రభావం మాత్రం బులియన్ మార్కెట్ ను షేక్ చేసింది.
మరోవైపు వజ్రాలు, ఆభరణాల ఎగుమతులు కూడా అయిదేళ్ల కనిష్టానికి చేరుకున్నాయి. అమెరికాకు ఎగుమతులు దాదాపు సగానికి తగ్గడం దీనికి ప్రధాన కారణం. ఈ పతనం భారత ఆర్థిక వ్యవస్థపై టారిఫ్‌ల ప్రభావానికి అద్దం పట్టింది. జెమ్ అండ్ జ్యువెలరీ ఎగుమతుల ప్రోత్సాహక మండలి గణాంకాల ప్రకారం 2026-27 ఆర్థిక సంవత్సరంలో రత్నాలు, ఆభరణాల ఎగుమతులు 27.72 బిలియన్ డాలర్లకు పడిపోయాయి.
కళ్యాణ్ జ్యువెలర్స్ షేర్ ధర భారీగా నష్టపోయింది. ఈ ఉదయం బోంబే స్టాక్ ఎక్స్ఛేంజీలో రూ. 389.50 ట్రేడ్ అయింది. శుక్రవారం నాటి క్లోజింగ్ సెషన్ తో పోల్చుకుంటే 8.28 శాతం నష్టపోయింది. అప్పుడు ఈ స్టాక్ రూ. 424.65 వద్ద 3.28 శాతం లాభాలతో ముగిసింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 43,855.31 కోట్లు.
సెన్కో గోల్డ్ షేర్ ధర దాదాపు 11 శాతం పతనమైంది. బీఎస్ఈలో రూ. 327.4 వద్ద 10.48 శాతం నష్టంతో ట్రేడింగ్ అవుతోంది. దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 5,361.39 కోట్లు. శుక్రవారం సెన్కో గోల్డ్ షేర్ ధర రూ. 365.45 వద్ద 6.36 శాతం లాభంతో ముగిసింది. అప్పుడు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 5,986.31 కోట్లు. మోదీ స్టేట్ మెంట్ ప్రభావంతో క్యాపిటలైజేషన్ లో సుమారు 500 కోట్ల రూపాయలు నష్టపోయింది.
టైటాన్ షేరు ధర కూడా సోమవారం పడిపోయింది. ఈ ఉదయం బీఎస్ఈలో ఈ స్టాక్ రూ. 4,226 వద్ద 6.37% నష్టంతో ట్రేడ్ అయింది. శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌లో టైటాన్ షేర్ రూ. 4,513.4 వద్ద 4.76% లాభాలతో ముగిసింది. ఇప్పుడు ఒక్కో షేర్ పై దాదాపుగా 300 రూపాయల మేర నష్టాన్ని చవి చూసింది.












Click it and Unblock the Notifications