అనంతపురం: సమైక్యాంధ్ర కోసం కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ చేస్తున్న ఉద్యమంతో తమకు సంబంధం లేదని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్ చెప్పారు. తమ పార్టీలో వంద మంది లగడపాటి రాజగోపాల్ లు ఉన్నారని ఆయన అన్నారు. శ్రీకృష్ణదేవరాయాంధ్ర విశ్వవిద్యాలయం విద్యార్థులను పరామర్శించేందుకు వచ్చిన తెలుగుదేశం నాయకులు పయ్యావుల కేశవ్, కాల్వ శ్రీనివాసులులను పోలీసులు గురువారం అరెస్టు చేసి రాప్తాడు పోలీసు స్టేషన్ కు తరలించారు. విద్యార్థులపై నిర్బంధం ద్వారా ఉద్యమాన్ని అణచివేస్తున్నారని, ఇందుకు హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి బాధ్యురాలని, ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థుల పట్ల ఒక రకంగా ఎస్కే విశ్వవిద్యాలయం విద్యార్థులపై మరో రకంగా వ్యవహరిస్తున్నారని కేశవ్ విమర్శించారు.
విద్యార్థులపై అకారణంగా దాడులు చేసి చితకబాదిన సంఘటనకు బాధ్యురాలైన చారు సిన్హాను బదిలీ చేయించడం తమ తొలి విజయమని ఆయన అన్నారు. విద్యార్థులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తేయాలని ఆయన డిమాండ్ చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా తాము బస్సు యాత్ర చేస్తామని ఆయన చెప్పారు. ఈ బస్సు యాత్ర తిరుపతి నుంచి ప్రారంభమై శ్రీకాకుళం వరకు సాగుతుందని ఆయన చెప్పారు. ఈ బస్సు యాత్రలో 22 నుంచి 23 మంది శాసనసభ్యులు పాల్గొంటారని ఆయన చెప్పారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి