న్యూఢిల్లీ: తెలంగాణ తీర్మానంపై పార్టీ శాసనసభ్యులకు విప్ జారీ చేసే సంప్రదాయం ఉండదని కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ చెప్పారు. తెలంగాణ ప్రక్రియకు వ్యతిరేకంగా ఢిల్లీ వచ్చిన 15 మంది కాంగ్రెసు శాసనసభ్యులు, ఎమ్మెల్సీలతో ఆయన గురువారం మాట్లాడారు. శాసనసభలో తీర్మానం ప్రతిపాదిస్తేనే తెలంగాణ ప్రక్రియ ముందుకు సాగుతుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి మీడియా ప్రతినిధులతో చెప్పారు. అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదిస్తేనే తీర్మానం ముందుకు వస్తుందని కూడా ప్రణబ్ చెప్పారు.
తెలంగాణేతర శాసనసభ్యులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, శాసనసభ్యులు తెలంగాణ తీర్మానంపై ఆత్మప్రబోధానుసారం శాసనసభలో ఓటు వేయవచ్చునని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియకు వ్యతిరేకంగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఢిల్లీ వెళ్లాలనే నిర్ణయంలో భాగంగా సీమాంధ్ర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఢిల్లీకి వచ్చారు. ఈ ప్రతినిధి బృందంలో రంగారెడ్డి జిల్లాకు చెందిన శాసనసభ్యుడు కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి కూడా ఉన్నారు. అయితే తాను వ్యక్తిగత పనుల మీద ఢిల్లీ వచ్చినట్లు ఆయన తెలిపారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి