హైదరాబాద్/వరంగల్: ఒక వేళ తెలంగాణను అడ్డుకుంటే తాము తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని కూడా వదులుకుంటామని తెలుగుదేశం పార్టీ నాయకుడు కడియం శ్రీహరి చెప్పారు. తెలంగాణ కోసం వరంగల్లులోని కాకతీయ విశ్వవిద్యాలయంలో దీక్షలు చేస్తున్న విద్యార్థులను ఆయన మంగళవారం పరామర్శించారు. చంద్రబాబు వైఖరి తెలంగాణపై సరిగా లేదంటూ విద్యార్థులు ఈ సందర్భంగా నినాదాలు చేశారు. తమకు పార్టీ కన్నా తెలంగాణనే ముఖ్యమని కడియం శ్రీహరి చెప్పారు. తెలంగాణ అమరుల కుటుంబాలకు తెలుగుదేశం తరఫున శాసనసభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్సీల ఒక రోజు వేతనాన్ని విరాళంగా ప్రకటించారు.
మంత్రి వర్గ సమావేశానికి హాజరు కాబోమని తెలంగాణ మంత్రులు చెప్పినంత మాత్రాన సరిపోదని, ఇంట్లో కూర్చుని ఫైళ్లు చూస్తున్నారని తెలుగుదేశం నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి హైదరాబాదులో అన్నారు. ఢిల్లీలో తెలంగాణ మంత్రలకు తగిన గౌరవం లభించలేదని, వారికి అవమానం జరిగిందని ఆయన అన్నారు. మంత్రులు పూర్తిగా రాజీనామాలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రాష్టపతి పాలనను తలపిస్తోందని మరో తెలుగుదేశం నాయకుడు టి. దేవేందర్ గౌడ్ అన్నారు. శాంతిభద్రతలపై గవర్నర్ నరసింహన్ డిజిపి, ఇంటెలిజెన్స్ ఐజిలతో సమీక్ష జరపడాన్ని ఆయన తప్పు పట్టారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి