టాప్ హీరోలు వేరు: ముఖ్యమంత్రి రోశయ్య

సినీ పరిశ్రమ ఇప్పటి చైన్నై నుంచి అప్పటి మద్రాసు నుంచి తరలి రావడానికి ఎన్నో దశాబ్దాలు పట్టిందని, దానికో చరిత్ర ఉందని ఆయన చెప్పారు. తాను పుట్టిన ప్రాంతాన్ని తీసుకుని సినీ పరిశ్రమ పట్ల సానుభూతితో ఆలోచించాలని, సినీ పరిశ్రమ లాగే రాష్ట్రావతరణకు కూడా చాలా చరిత్ర ఉందని, రాత్రికి రాత్రి జరిగింది కాదని, వాటి వివరాల్లో వెళ్లదలుచుకోలేదని ఆయన అన్నారు. సినీ పరిశ్రమకు ఇబ్బంది కలిగించకూడదని ఆయన స్థానికులకు విజ్ఞప్తి చేశారు. ఈ రాష్ట్రవాసులంటే ఏ జిల్లాకు చెందినవారనేది కాకుండా ఆంధ్రప్రదేశ్ కు చెందినవారేనని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత కాసు బ్రహ్మానంద రెడ్డి సినీ పరిశ్రమను రాష్ట్రానికి తరలింపజేయడానికి ప్రయత్నించారని, అయితే మర్రి చెన్నారెడ్డి ఎంతో కృషి చేసి సినీ పరిశ్రమకు హైదరాబాదుకు తేవడంలో సఫలమయ్యారని ఆయన చెప్పారు. అక్కినేని నాగేశ్వరరావు తొలుత వచ్చిన తర్వాత ఒక్కరొక్కరే వచ్చారని, ఇప్పుడు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందిందని, హిందీ సినిమా షూటింగులకు కూడా రామోజీ ఫిల్మ్ సిటీ వంటిది ఉపయోగపడుతోందని ఆయన అన్నారు. మార్కెటు రేటుకు హైదరాబాదులో ప్రభుత్వాలు స్టూడియోల నిర్మాణానికి భూములు ఇచ్చిందని, ఆ భూముల రేట్లు ఇప్పుడు పెరిగాయని, దాంతో కారు చౌకకు సినీ పరిశ్రమకు భూములు ఇచ్చారనే వాదనలో నిజం లేదని ఆయన అన్నారు.
మోహన్ బాబు సమైక్యవాదం ఎత్తుకోవడం వల్ల ఆయన కుమారులు మనోజ్ సినిమా షూటింగ్ పై దాడి జరిగిందని, ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవి సమైక్యాంధ్ర ఆందోళనకు దిగడం వల్ల ఆయన మేనల్లుడు అల్లు అర్జున్ షూటింగ్ మీద దాడి జరిగిందని ఆనుకోవచ్చునని, అయితే జూనియర్ ఎన్టీఆర్ గానీ, మహేష్ బాబు గానీ ఏమీ మాట్లాడడం లేదని, అయినా వారి సినిమా షూటింగులపై దాడులు జరిగాయని, ఇది మంచి పద్ధతి కాదని రోశయ్య వివరించారు. సినీ పరిశ్రమలో తెలంగాణవారు అప్పుడూ ఉన్నారు, ఇప్పుడూ ఉన్నారని ఆయన అన్నారు. కొంచెం ఇబ్బంది కలుగుతుందని తాము చెన్నైకి వెళ్లిపోతామని సినీ పెద్దలు అనడం బ్లాక్ మెయిల్ చేయడం కాదా అని మీడియా ప్రతినిధులు అడిగితే మీ ఇష్టం వచ్చినట్లు అర్థం చేసుకోండి, రాసుకోండి అని అన్నారు. సినీ పరిశ్రమకు ఇబ్బంది కలిగితే వారు వెళ్లిపోతే ఉపాధి అవకాశాలు దెబ్బ తింటాయని తన ఆవేదన అన్నారని ఆయన అన్నారు. వారు వెళ్లిపోతామని అంటే శిక్షించడానికి ఏదైనా శిక్ష ఉంటే చెప్పండి, వేద్దామని ఆయన అన్నారు. తాము ఉపాధికి మరోచోటికి పోతామంటే తప్పెలా అవుతుందని ఆయన అన్నారు.
తనకు ఇబ్బందులు చెప్పినవారు చాలా మంది ఉన్నారని, పారిశ్రామికవేత్తలు, సినీ పెద్దలు తనకు తమ ఇబ్బందులు చెప్పారని, వారి పేర్లు ఇస్తే వారికి ఇబ్బందులు తలెత్తుతాయని, అన్ని పేర్లు వేయడం కూడా మీడియాకు వీలు కాదని, అందువల్ల తాను వారి పేర్లు ఇవ్వలేదని ఆయన అన్నారు. ఏయే పరిశ్రమలు ఈ నెల ఆందోళనల కాలంలో వెనక్కి వెళ్లిపోయారో వివరాలు ఇవ్వాలని మీడియా ప్రతినిధులు అడిగితే తాను ఇస్తానని ఆయన జవాబిచ్చారు. ఎవరికైనా వారి వారి ప్రాంతాల మీద అభిమానం ఉండవచ్చునని, కానీ దురభిమానం ఉండకూడదని, అన్ని ప్రాంతాలూ తనకు సమానమేనని, ఏ ప్రాంత ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి తాను ప్రయత్నిస్తానని ఆయన చెప్పారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం సరి కాదని ఆయన అన్నారు. విభేదించినా కూడా నాగరికంగా ఉండాలని, కొందరి పదాలు వినడానికే భయంకరంగా ఉంటాయని, అందరికీ హితవు చెప్పేవాడిని కానని, తనకు సరళంగా చేతనైన పద్ధతిలో మాట్లాడతానని, అందరికీ తాను పాఠాలు చెప్పలేనని ఆయన అన్నారు.