హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. జనవరి 5వ తేదీ చర్చల ద్వారా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైనట్లు అని ఆయన అన్నారు. తెలంగాణ మంత్రులతో సమావేశం అనంతరం ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేసింది కాబట్టే తెలంగాణ మంత్రులు రాజీనామాలు ఉపసంహరించుకున్నారని ఆయన సమర్థించారు. జనవరి ఐదో తేదీ చర్చలకు ప్రతి పార్టీ నుంచి ఇద్దరేసి ప్రతినిధులు రావాలని కేంద్రం నుంచి పిలుపు వచ్చిందని ఆయన చెప్పారు. తమ పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీతో, ముఖ్యమంత్రి కె. రోశయ్యతో చర్చించి ఆ ఇద్దరు కాంగ్రెసు ప్రతినిధులను ఖరారు చేస్తామని ఆయన చెప్పారు.
రాష్ట్రం నుంచి పరిశ్రమలు తరలిపోతాయనే మాటలో నిజం లేదని ఆయన అన్నారు. పరిశ్రమలేవీ తెలంగాణ నుంచి తరలిపోవని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సమస్య తాత్కాలికమేనని ఆయన అన్నారు. ఆందోళనలు త్వరలో సమసిపోతాయని పారిశ్రామికవేత్తలకు తెలుసునని, అందువల్ల పరిశ్రమలు తరలిపోయే సమస్య లేదని ఆయన అన్నారు. పిసిసి విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉందని, పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి