కోడి కాళ్ల కూర ఇలా చేస్తే యమా టేస్ట్.. ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో ??
చికెన్.. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ఇందులో ఎన్నో రకాలు ఉన్నా కానీ.. కొత్తగా మళ్లీ పూటకో రకం పుట్టుకొస్తూనే ఉంటాయి. అంతే కాకుండా చికెన్ అనేది మంచి ప్రొటీన్ ఫుడ్‌గా గుర్తింపు పొందింది. శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్‌ను అందించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.అయితే చాలామంది కోడి కాళ్లను (Chicken Feet) చూసి అసహ్యించుకుంటారు. కానీ పోషకాహార నిపుణుల ప్రకారం, ఇవి శరీరానికి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందించే సూపర్ ఫుడ్‌లలో ఒకటి.
ముఖ్యంగా కోడి కాళ్లలో ఉండే సహజ కొల్లాజెన్ (Collagen), కాల్షియం, మాగ్నీషియం, ఫాస్ఫరస్ వంటి పోషకాలు ఎముకలు, కీళ్లు, చర్మం, జుట్టు ఆరో్యానికి ఎంతో మేలు చేస్తాయి. వయసు పెరిగేకొద్దీ శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. దీంతో చర్మం ముడతలు పడటం, కీళ్ల నొప్పులు, ఎముకల బలహీనత వంటి సమస్యలు రావడం సహజం. ఇలాంటి పరిస్థితుల్లో కోడి కాళ్లతో చేసిన సూప్ లేదా కూర తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు సహజంగా అందుతాయి...

కోడి కాళ్ల కూరకు కావలసిన పదార్థాలు..
- కోడి కాళ్లు - 1/2 కిలో
- ఉల్లిపాయలు - 2
- టమాటాలు - 2
- అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 స్పూన్
- కారం - 1 స్పూన్
- ధనియాల పొడి - 1 స్పూన్
- గరం మసాలా - అర స్పూన్
- పసుపు - చిటికెడు
- నూనె - తగినంత
- కరివేపాకు, కొత్తిమీర - కొద్దిగా
- ఉప్పు - సరిపడా
తయారీ విధానం..
- ముందుగా కోడి కాళ్లను శుభ్రం చేసి కొద్దిగా పసుపు, ఉప్పుతో ఉడికించుకోవాలి.
- పాన్‌లో నూనె వేడి చేసి ఉల్లిపాయలు, కరివేపాకు వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి.
- తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటాలు వేసి మసాలా బాగా మగ్గించాలి.
- ఇప్పుడు కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి కలిపి, ఉడికించిన కోడి కాళ్లు జోడించాలి.
- కొద్దిగా నీరు పోసి 15 నిమిషాలు మగ్గనివ్వాలి.
- చివరగా కొత్తిమీర చల్లి దింపేస్తే రుచికరమైన కోడి కాళ్ల కూర సిద్ధం.
- ఈ కూరను రాగి సంగటి, అన్నం, రోటీ, చపాతీలతో తింటే మరింత రుచిగా ఉంటుంది.
కోడి కాళ్ల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..
1. కీళ్ల నొప్పులకు ఉపశమనం
కోడికాళ్లలో ఉండే సహజ కొల్లాజెన్ కీళ్ల మధ్య కార్టిలేజ్‌ను బలపరుస్తుంది. దీంతో మోకాళ్ల నొప్పులు, జాయింట్ సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది.
2. ఎముకలు బలపడతాయి
కాల్షియం, ఫాస్ఫరస్, మాగ్నీషియం ఎక్కువగా ఉండటం వల్ల ఎముకలు దృఢంగా మారతాయి. వృద్ధులకు ఇది ఎంతో మేలు చేస్తుంది.
3. చర్మం యవ్వనంగా కనిపిస్తుంది
కొల్లాజెన్ చర్మాన్ని బిగుతుగా ఉంచి ముడతలు తగ్గించడంలో సహాయపడుతుంది. అందుకే చాలా మంది బ్యూటీ డైట్‌లో చికెన్ బోన్ బ్రోత్‌ను చేర్చుకుంటారు.
4. జుట్టు, గోర్లు బలపడతాయి
కోడికాళ్లలోని ప్రోటీన్లు, ఖనిజాలు జుట్టు రాలడాన్ని తగ్గించి గోర్లు బలంగా పెరగడంలో సహాయపడతాయి.
5. రోగనిరోధక శక్తి పెరుగుతుంది
వేడి వేడి కోడి కాళ్ల సూప్ తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు సమయంలో ఉపశమనం లభిస్తుంది. శరీరానికి శక్తిని కూడా అందిస్తుంది.
6. శరీరానికి సహజ ఎనర్జీ
అధిక ప్రోటీన్, పోషకాలు ఉండటం వల్ల అలసట తగ్గి శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది.
జాగ్రత్తలు..
- కోడి కాళ్లను ఎప్పుడూ పూర్తిగా శుభ్రం చేసి మాత్రమే వాడాలి.
- సరిగా ఉడికించకుండా తింటే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది.
- ఎక్కువ నూనె, మసాలాలతో వేయించి తినడం ఆరోగ్యానికి హానికరం.
- హై కొలెస్ట్రాల్, బీపీ, గుండె సమస్యలు ఉన్నవారు పరిమితంగా మాత్రమే తీసుకోవాలి.
- వారానికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే తీసుకోవడం ఉత్తమం.












Click it and Unblock the Notifications