సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. ఉన్మాది చేతిలో ప్రముఖ సింగర్ దారుణ హత్య!
పంజాబీ సంగీత పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొది. ప్రముఖ పంజాబీ సింగర్ ఇందర్ కౌర్ అలియాస్ యష్ ఇందర్ కౌర్(29) దారుణ హత్యకు గురైంది. మంగళవారం(మే 19) ఉదయం ఆమె మృతదేహం నీలో కాలువలో లభ్యమైంది. ఆరు రోజుల క్రితం కొందరు దుండగులు ఆమెను తుపాకీతో బెదిరించి కిడ్నాప్ చేయగా.. అప్పటి నుంచి పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు. అయితే చివరకు ఆమె శవమై తేలడంతో కుటుంబ సభ్యులు, అభిమానులు కన్నీరుమున్నీరవుతున్నారు. పెళ్లికి నిరాకరించిందనే ఒకే ఒక్క కారణంతో ఓ ఉన్మాది ఆమె ప్రాణాలను బలితీసుకోవడం పంజాబీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది.
మరణానికి కేవలం 5 రోజుల క్రితం (మే 13న) ఇందర్ కౌర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన చివరి పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. బ్రౌన్ షర్ట్ వేసుకుని, తలదించుకుని ఉన్న ఓ అందమైన ఫోటోను షేర్ చేస్తూ ఆమె కేవలం ఓ హార్ట్ ఎమోజీని క్యాప్షన్‌గా పెట్టింది. అయితే ఈ ఫోటో వెనుక ఓ మిస్టరీ దాగి ఉంది. నిజానికి ఇది ఆమె 2022 మే 19న పెట్టిన పాత ఫోటో. రెండేళ్లుగా సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా లేని ఇందర్ కౌర్, 2024 అక్టోబర్‌లో జర్మనీ ట్రిప్ ఫోటోల తర్వాత మళ్లీ ఇప్పుడే పోస్ట్ చేసింది. అసలు ఆరు రోజుల క్రితం కిడ్నాప్ అయిన ఇందర్ కౌర్, ఐదు రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటో ఎలా పోస్ట్ చేసిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కిడ్నాపర్లు ఆమె ఫోన్‌ను వాడుతూ ఈ పోస్ట్ చేశారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇన్‌స్టా దోస్తీ.. చివరకు ప్రాణాల మీదికి!
ఇందర్ కౌర్ హత్య వెనుక ఉన్న కారణాలను పోలీసులు వెల్లడించారు. పంజాబ్‌లోని మోగా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తితో మూడేళ్ల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో ఇందర్ కౌర్‌కు పరిచయం ఏర్పడింది. అది కాస్తా స్నేహంగా మారి, ఆ తర్వాత అతను ప్రేమ పేరుతో ఆమెను నమ్మించాడు. అయితే సదరు వ్యక్తికి అప్పటికే పెళ్లయి పిల్లలు ఉన్నారనే చేదు నిజం ఇందర్ కౌర్‌కు ఆలస్యంగా తెలిసింది. దీంతో తీవ్రంగా కలత చెందిన ఇందర్ కౌర్.. అతనితో పెళ్లికి, బంధానికి పూర్తిగా నిరాకరించింది. తనను మోసం చేసిన వ్యక్తిని దూరం పెట్టింది.
కెనడా నుంచి వచ్చి కిడ్నాప్.. నిందితుడు పరార్!
పెళ్లికి నో చెప్పడంతో కక్ష పెంచుకున్న సదరు ఉన్మాది.. ఆమెపై పగ తీర్చుకోవాలని డిసైడ్ అయ్యాడు. ప్రస్తుతం కెనడాలో ఉంటున్నఆ వ్యక్తి.. ఇందర్ కౌర్‌ను అంతమొందించడానికే నేపాల్ మీదుగా రహస్యంగా పంజాబ్ చేరుకున్నాడు. 6 రోజుల క్రితం తన అనుచరులతో కలిసి గన్ పాయింట్‌లో ఆమెను కిడ్నాప్ చేసి, దారుణంగా హత్య చేసి కాలువలో పడేశాడు. హత్య అనంతరం నిందితుడు తిరిగి కెనడాకు పారిపోయినట్లు వార్తలు వస్తున్నాయి.
ఇందర్ కౌర్ పంజాబీలో 'కిసాన్ యాంథమ్ 2', 'జీజా', 'దేశీ సిరే దా', 'నబ్జ్ జట్టీ దీ', 'అకడ' వంటి ఎన్నో సూపర్ హిట్ మ్యూజిక్ వీడియోలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఎన్నో పెద్ద కలలతో ఇండస్ట్రీలో రాణిస్తున్న తరుణంలోనే, ఇన్‌స్టాగ్రామ్ పరిచయం ఆమె జీవితాన్ని ఇలా అర్ధాంతరంగా ముగించేసింది.












Click it and Unblock the Notifications