సిఎం ఎందుకు తీర్మానం పెట్టలేదు: నాగం జనార్దన్ రెడ్డి
State
oi-Pratapreddy
By Pratap
|
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ఆదేశం మేరకు ముఖ్యమంత్రి కె. రోశయ్య తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తీర్మానాన్ని ఎందుకు శాసనసభలో ప్రవేశపెట్టలేదని తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంత నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ తీర్మానాన్ని ముఖ్యమంత్రి శాసనసభలో ప్రతిపాదిస్తారని చిదంబరం తన తెలంగాణ ప్రకటనలో చెప్పారని, ఆ మేరకు రోశయ్య తెలంగాణ తీర్మానం ప్రతిపాదించకుండా కేంద్ర ప్రభుత్వాన్ని ధిక్కరించారని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఈ నెల 5వ తేదీన రాజకీయ పార్టీలను ఎందుకు చిదంబరం చర్చలకు పిలిచారో అర్థం కావడం లేదని, ఆ విషయంలో స్పష్టత లేకుండా చర్చలు సఫలం కావని ఆయన అన్నారు. ఏ ప్రయోజనం ఆశించి చిదంబరం చర్చలకు పిలుస్తున్నిారో అర్థం కావడం లేదని ఆయన అన్నారు.
సంప్రదింపులు జరుపుతామని యుపిఎ ప్రభుత్వం 2004లో ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికలో చెప్పిందని, రాష్ట్రపతి ప్రసంగంలో కూడా చేర్చిందని, కానీ చర్చలు జరపకుండా కాలయాపన చేసిందని ఆయన అన్నారు. ఈ నెల 3వ తేదీ విద్యార్థి గర్జనకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆయన చెప్పారు. విద్యార్థులపై పెట్టిన కేసులను ఉపసంహరించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తనపై దాడి కేసులో విద్యార్థులపై కేసులు ఉంటే తాను ఉపసంహరించుకుంటానని ఆయన చెప్పారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి