న్యూఢిల్లీ: రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని తాము డిమాండ్ చేసినట్లు మజ్లీస్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ చెప్పారు. కేంద్ర హోం మంత్రి చిదంబరంతో అఖిల పక్ష సమావేశం అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాష్ట్ర విభజనకు సంబంధించి తమను ఏ పార్టీ కూడా పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. రాష్ట్ర విభజన సమస్యపై నిర్ణీత కాలవ్యవధి పెట్టాలని, అందుకు కమిటీ వేసి విస్తృత స్థాయి చర్చలు జరపాలని సూచించామని ఆయన చెప్పారు. అప్పుడే తమ అభిప్రాయాన్ని చెప్తామని ఆయన అన్నారు. తమ ఆత్మగౌరవం, తమ సమస్యల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. ఉగ్రవాదుల పేర ముస్లిం యువకులను వేధిస్తున్నారని ఆయన అన్నారు.
తెలంగాణ ఉద్యమంలో మావోయిస్టుల పాత్ర ఉందనే వాదనను తాను చిదంబరంతో జరిగిన సమావేశంలో తోసిపుచ్చినట్లు కాంగ్రెసు తెలంగామ ప్రతినిధి ఉత్తమ కుమార్ రెడ్డి చెప్పారు. ఉద్యమంలో మావోలు లేరని, తెలంగాణ రాష్ట్ర ఏర్పడితే మావోల ప్రాబల్యం పెరుగుతుందనే వాదనను కూడా తాను తోసిపుచ్చానని ఆయన వివరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వెంటనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరినట్లు ఆయన తెలిపారు. ప్రధాని మన్మోహన్ సింగ్ తో మాట్లాడిన తర్వాత చిదంబరం ప్రకటన చేసే అవకాశం ఉందని ఆయన చెప్పారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి