హైదరాబాద్: గత నెలా పదిహేను రోజులుగా ఎవరెవరు ఏమేం చేస్తున్నారో అన్నీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడికి తెలుసునని రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలపై చేసిన విమర్శలపై ప్రతిస్పందిస్తూ ఆమె ఆ విధంగా అన్నారు. రాష్టంలో ఈ పరిస్థితులు ఎందుకు వచ్చాయో చంద్రబాబు ఆలోచించుకోవాలని ఆమె సూచించారు. వైయస్ రాజశేఖర రెడ్డి మృతిపై సిబిఐ దర్యాప్తును వేగవంతం చేయించి, నివేదిక త్వరగా వచ్చేలా చూడాలని ముఖ్యమంత్రి రోశయ్య కేంద్ర హోం మంత్రి చిదంబరాన్ని కోరినట్లు ఆమె శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
టీవీ చానెళ్లలో వార్తాకథనం ప్రసారమైన వెంటనే రాష్టంలో విధ్వంసం చెలరేగిందని, విధ్వంసానికి పాల్పడిన కేసుల్లో 187 మందిని అరెస్టు చేశామని ఆమె చెప్పారు. మొత్తం 96 కేసులు నమోదు చేసినట్లు ఆమె తెలిపారు. ఈ కేసుల్లో ఎంతటివారైనా ఉపేక్షించబోమని, కఠినంగా వ్యవహరిస్తామని ఆమె చెప్పారు. వైయస్ మరణంపై వార్తాకథనం ప్రసారం చేసిన టీవీ చానెల్ పై కేసు నమోదు చేస్తామని, దర్యాప్తు కోసం కేసు నమోదు చేయాల్సి ఉంటుందని ఆమె చెప్పారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి