న్యూఢిల్లీ: వైయస్ మరణంపై టీవి చానెళ్ల వార్తాకథనాలు, రిలయన్స్ కార్యాలయాలపై దాడుల నేపథ్యంలో కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ తమ పార్టీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. వైయస్ మరణం వెనక రిలయన్స్ అధినేతల హస్తం ఉందంటూ సాక్షి టీవీ చానెల్ లో వార్తా కథనం ప్రసారం కావడాన్ని ఆమె సీరియస్ గా తీసుకున్నట్లు సమాచారం. కార్పొరేట్ సంస్థల విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుందని ఆమె అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. మీడియా చానెళ్ల వార్తా కథనాలపై రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ సీరియస్ గా తీసుకున్నారు. సోనియాకు ఆయన ఫోన్ చేసి మాట్లాడినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అసత్య ప్రచారంపై, రిలయన్స్ ఆస్తులపై దాడులపై ఆయన సోనియాకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
అబద్ధం వార్తాకథనాలు ప్రసారం చేసిన చానెళ్లపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరినట్లు సమాచారం. రాష్టంలో పరిస్థితిపై ఆమె అత్యవసరంగా నివేదిక తెప్పించుకున్నారు. ఆమె కేంద్ర హోం మంత్రి చిదంబరానికి ఫోన్ చేశారు. రిలయన్స్ ఆస్తులపై దాడి చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. పరిస్థితులను అదుపులోకి తేవాలని ఆమె ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కాంగ్రెసు కోర్ కమిటీ సమావేశమై ఆంధ్రప్రదేశ్ పరిస్థితులపై చర్చించనుంది. ఈ చర్చల్లో టీవీ చానెళ్ల కథనాలపై, రిలయన్స్ ఆస్తులపై దాడుల మీద, తెలంగాణ ఏర్పాటు ప్రకియ మీద చర్చలు జరిపే అవకాశం ఉంది.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి