వరంగల్: సమైక్యాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిగా చూడాలనుందని కాంగ్రెసు శాసనసభ్యురాలు, మాజీ మంత్రి కొండా సురేఖ అన్నారు. రాష్ట్ర విభజన ముందుకు వచ్చిన నేపథ్యంలో అది జరిగేలా సమైక్యాంధ్రప్రదేశ్ కు జగన్ ముఖ్యమంత్రి కావాలనేది తన అభిమతమని ఆమె శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ముఖ్యమంత్రిగా కె.రోశయ్య విఫలమయ్యారని ఆమె విమర్శించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని ఆమె కేంద్ర ప్రభుత్వాని డిమాండ్ చేశారు.
రాష్టంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం నిస్సహాయ స్థితిలో ఉందని ఆమె విమర్శించారు. వైయస్ రాజశేఖరరెడ్డి మరణించి నాలుగు నెలలు గడుస్తున్నా దర్యాప్తు ముందుకు సాగడం లేదని ఆమె అన్నారు. తన ప్రియతమ నాయకుడిని కోల్పోయిన బాధాతప్త హృదయంతో ఉన్న ప్రజలు వైయస్ మరణం వెనక కుట్ర ఉందని వార్తాకథనాలు రాగానే ఉద్రేకానికి లోనయ్యారని ఆమె అన్నారు. తాము జిల్లా బంద్ పాటించడానికి బయలుదేరుతుంటే ఎస్పీ అడ్డుకోవడాన్ని ఆమె తప్పు పట్టారు. వరంగల్ జిల్లాకు చెందిన రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్యపై ఆమె తీవ్రంగా ధ్వజమెత్తారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి