హన్మకొండ: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుచేయాలని ఇప్పటి వరకు వివిధ రూపాల్లో ఆందోళనలు చేసిన ప్రజలు ఇక ఆంధ్ర పెట్టుబడిదారుల ఉత్పత్తులను వినియోగించకుండా నిరసన తెలపాలని విద్యావంతుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిట్టల రవీందర్ పిలుపునిచ్చారు. హన్మకొండ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రాంతంలోని ఆంధ్రా వారి ఆస్పత్రులు, విద్యాసంస్థలను తెలంగాణ ప్రజలు బహిష్కరించి నిరసన తెలపాలని కోరారు. తెలంగాణ ఉద్యమానికి స్పందించిన కేంద్ర ప్రభుత్వం మొదట ప్రకటన చేసి తరువాత అటకెక్కించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. అయితే, ఇప్పుడు ఉద్యమం విద్యార్థులు, ప్రజల చేతుల్లోకి వెళ్లిందని ఇక ఆపడం ఎవరి తరమూ కాదన్నారు.
ఇకనైనా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు గవర్నర్, స్పీకర్ మీద ఒత్తిడి తెచ్చి రాజీనామాలను ఆమోదింపచేసుకోవాలని సూచించారు. కేయూ అకుట్ అధ్యక్షుడు పాపిరెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్‌లో ఆంధ్రా వాళ్లు పెట్టిన పెట్టుబడులు ఏమీ లేవని ఇక్కడి భూములు, వనరులను వినియోగించుకునే వారు అభివృద్ధి చెందారని పేర్కొన్నారు. రామోజీరావు నుంచి సత్యం రామలింగరాజు, రెడ్డి ల్యాబ్స్ అంజిరెడ్డి వరకు అందరి పరిస్థితి ఇదేనన్నారు. సినీ పరిశ్రమ తరలిపోయినంత మాత్రాన తెలంగాణ ప్రజలు నష్టపోయేదేమీ లేదని, వాటి భూములైనా ఇక్కడి ప్రజలకు మిగులుతాయన్నారు. సమావేశంలో విద్యావంతుల వేదిక నాయకులు ప్రొఫెసర్‌సీతారామారావు, నారాయణరావు, శ్రీనివాసరెడ్డి(డీటీఎఫ్), విజయ్‌బాబు, ఎం.వీరన్న తదితరులు పాల్గొన్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి