హైదరాబాద్: అసలే కోతి ఆపై కల్లు తాగి నిప్పు తొక్కిందని తెలుగుదేశం నాయకుడు వర్ల రామయ్య కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ పై వ్యాఖ్యానించారు. రిలయన్స్ పై వైయస్ జగన్ పథకం ప్రకారం దాడులు చేయించారని ఆయన ఆరోపించారు. రిలయన్స్ పై దాడులను తమ నేత చంద్రబాబు నాయుడు ఖండించడంపై కాంగ్రెసు విమర్శించడాన్ని ఆయన సోమవారం మీడియా సమావేశంలో తప్పు పట్టారు. తమ నేత రిలయన్స్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారని కాంగ్రెసు అనడాన్ని ఆయన ఖండించారు. రిలయన్స్ పై దాడులపై మాట్లాడిన సోనియా, ప్రధాని మన్మోహన్, చిబంరాలు కూడా బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నట్లేనా ఆయన అడిగారు.
రామయ్యపై సాక్షి టీవీ ప్రతినిధులు వాదనకు దిగారు. తనపై వాదనకు దిగడం సరి కాదని, తాను చెప్పింది రాసుకోవాలని, ప్రశ్నలు అడగాలే తప్ప వాదనకు దిగకూడదని, జగన్ ను జర్నలిస్టులు భుజాన మోయడం మంచిది కాదని ఆయన అన్నారు. వైయస్ జగన్ డబ్బులు, టీవీ చానెల్, పత్రిక వంటి అన్ని హంగులూ సమకూర్చుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. రిలయన్స్ పై దాడులను వైయస్ జగన్ విచ్చలవిడిగా రొచ్చగొట్టారని ఆయన ఆరోపించారు. తమ నేతను బలపరచడం తన విధి అని, తానేమైనా తప్పుగా మాట్లాడితే చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చునని ఆయన అన్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి