"స్వీట్ కార్న్ మంచూరియా" ఎలా చేయాలంటే ??
స్నాక్స్ గురించి చెప్పుకోవాలంటే.. కొంచెం కొత్త రుచిని ట్రై చేయాలనుకుంటే స్వీట్ కార్న్ మంచూరియా బెస్ట్ ఆప్షన్. స్వీట్ కార్న్ మంచూరియా ఇంట్లోనే సులభంగా, కరకరలాడుతూ తయారు చేసుకునే రుచికరమైన ఇండో-చైనీస్ స్టాటర్. స్వీట్ కార్న్ గింజలను కార్న్ ఫ్లోర్, మైదాతో కోటింగ్ చేసి డీప్ ఫ్రై చేసి, వెల్లుల్లి, సోయా సాస్, చిల్లీ సాస్‌లతో చేసిన మిశ్రమంలో టాస్ చేయడం ద్వారా దీనిని తయారు చేస్తారు.
ఇంట్లో తక్కువ సమయంలో, చాలా సులభంగా ఈ స్నాక్ తయారు చేసుకోవచ్చు. సాయంత్రం టీ టైమ్‌కే కాకుండా, చిన్న పార్టీలకు, గెట్ టుగెదర్స్‌కు, పిల్లల టిఫిన్ బాక్స్‌లకు కూడా ఇవి మంచి ఎంపికగా నిలుస్తాయి. అంతే కాకుండా సాధారణ పకోడీలతో పోలిస్తే మొక్కజొన్నలో ఫైబర్ (పీచు పదార్థం) ఎక్కువగా ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఈ టేస్టీ రెసిపీ మీకోసం ప్రత్యేకంగా..

కావలసిన పదార్థాలు
కార్న్ ఫ్రై కోసం:
స్వీట్ కార్న్ గింజలు - 1 కప్పు
కార్న్ ఫ్లోర్ - 2 టేబుల్ స్పూన్లు
మైదా - 1 టేబుల్ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
కారం - ½ టీస్పూన్
మిరియాల పొడి - ¼ టీస్పూన్
ఉప్పు - తగినంత
నూనె - డీప్ ఫ్రైకి సరిపడా
సాస్ తయారీకి:
నూనె - 2 టేబుల్ స్పూన్లు
వెల్లుల్లి - 1 టేబుల్ స్పూన్ (సన్నగా తరిగినది)
పచ్చిమిర్చి - 2
ఉల్లిపాయ - 1 (చిన్న ముక్కలు)
క్యాప్సికం - ½ కప్పు
స్ప్రింగ్ ఆనియన్స్ - కొద్దిగా
సోయా సాస్ - 1 టేబుల్ స్పూన్
టొమాటో కెచప్ - 2 టేబుల్ స్పూన్లు
చిల్లీ సాస్ - 1 టేబుల్ స్పూన్
వెనిగర్ - 1 టీస్పూన్
చక్కెర - చిటికెడు
ఉప్పు - అవసరానికి సరిపడా
కార్న్ ఫ్లోర్ స్లర్రీ - 1 టీస్పూన్ కార్న్ ఫ్లోర్ + 3 టేబుల్ స్పూన్లు నీరు
తయారీ విధానం..
ముందుగా స్వీట్ కార్న్ గింజలను ఒక బౌల్‌లో వేసుకోవాలి. అందులో కార్న్ ఫ్లోర్, మైదా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, మిరియాల పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి. చాలా తక్కువ నీరు చల్లి ప్రతి గింజకు పిండి పట్టేలా కలపాలి.
స్టవ్‌పై కడాయి పెట్టి నూనె వేడి చేయాలి. నూనె బాగా కాగాక కార్న్ గింజలను కొద్దికొద్దిగా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేయాలి. బయటకు తీసి టిష్యూపై వేస్తే అదనపు నూనె తొలగిపోతుంది.
మరో పాన్‌లో కొద్దిగా నూనె వేసి వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు, క్యాప్సికం వేసి హై ఫ్లేమ్‌పై 2 నిమిషాలు టాస్ చేయాలి. కూరగాయలు పూర్తిగా మెత్తబడకుండా ఉండాలి.
ఇప్పుడు సోయా సాస్, టొమాటో కెచప్, చిల్లీ సాస్, వెనిగర్, చిటికెడు చక్కెర వేసి బాగా కలపాలి. తర్వాత కార్న్ ఫ్లోర్ స్లర్రీ పోసి సాస్ కొద్దిగా చిక్కబడే వరకు ఉడికించాలి.
ముందుగా ఫ్రై చేసిన కార్న్ గింజలను సాస్‌లో వేసి బాగా టాస్ చేయాలి. చివరగా స్ప్రింగ్ ఆనియన్స్ చల్లి వేడివేడిగా సర్వ్ చేయాలి.
చిట్కాలు..
కార్న్ గింజలను ఫ్రై చేసే ముందు ఫ్రిజ్‌లో 10 నిమిషాలు పెట్టితే మరింత క్రిస్పీగా వస్తాయి.
ఎక్కువ నీరు వేయకపోతే కోటింగ్ బాగా పట్టి కరకరలాడుతుంది.
పిల్లల కోసం చేస్తే కారం తగ్గించి చీజ్ తురుము చల్లవచ్చు.
డ్రై మంచూరియా కావాలంటే సాస్ తక్కువగా వాడాలి.
గ్రేవీ స్టైల్ కావాలంటే కొద్దిగా నీరు, అదనంగా కార్న్ ఫ్లోర్ స్లర్రీ కలపాలి.
స్పైసీ టేస్ట్ కోసం చివర్లో చిల్లీ ఫ్లేక్స్ లేదా పెప్పర్ పొడి చల్లవచ్చు.












Click it and Unblock the Notifications