హైదరాబాద్: తాత ఎన్టీఆర్ భౌతికంగా లేకపోయినా మన గుండెల్లో, మన ప్రతి పనిలో ఉన్నారని ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా సోమవారం నివాళులు అర్పించారు. హరికృష్ణ, ఆయన కుమారులు జూనియర్ ఎన్టీఆర్, తారకరత్న, చెల్లెలు కేంద్ర మంత్రి పురంధేశ్వరి, బావ, శాసనసభ్యుడు దగ్దుబాటి వెంకటేశ్వరరావు, ఇతర కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ ఘాటుకు వచ్చిన ఆయన సమాధి మీద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు. తాత ఎన్టీఆర్ ఆశీర్వాదం అందరికీ ఉంటుందని, తాత స్మృతిలో ముందుకు సాగుతామని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు.
తన తండ్రి ఎన్టీఆర్ ఆశయాల సాధన కోసం కృషి చేస్తామని హరికృష్ణ అన్నారు. ఎన్టీఆర్ ఆశీర్వాద బలంతో ముందుకు సాగుతామని ఆయన చెప్పారు. అందరూ బాగుండాలని, అందరూ సుఖసంతోషాలతో విలసిల్లాలని ఎన్టీఆర్ పై నుంచి దీవెనలు అందిస్తారని ఆయన చెప్పారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి