తెలంగాణ విద్యార్థుల పరీక్షల బహిష్కరణ

నల్లగొండ జిల్లాలోని నల్లగొండ, మిర్యాలగూడా, సూర్యాపేట, భువనగిరిల్లో విద్యార్థులు పరీక్షలు బహిష్కరించారు. ప్రశ్నపత్రాలను చించేశారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన కాలపరిమితితో కూడిన ప్రకటన చేసే వరకు పరీక్షలు రాయబోమని వారు భీష్మించుకున్నారు. మెదక్ జిల్లాలోని సంగారెడ్డి, సిద్ధిపేటల్లో కూడా విద్యార్థులు పరీక్షలు బహిష్కరించారు. కరీంనగర్ లోని శాతవాహన కళాశాల విద్యార్థులు పరీక్షలు బహిష్కరించారు. కళాశాల ప్రధాన ద్వారానికి తాళం వేశారు. నిజామాబాద్ లోని గిరిరాజ్ కళాశాల విద్యార్థులు కూడా పరీక్షలు బహిష్కరించారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిధిలో మంగళవారం నుంచి జరగాల్సిన అన్ని పరీక్షలను రద్దు చేస్తున్నట్లు విశ్వవిద్యాలయ అధికారులు ప్రకటించారు.